Vijayasai Reddy: దక్షిణాదిలో 'మలయాళ మనోరమ' 20 లక్షల కాపీలతో దూసుకుపోతోంది: విజయసాయిరెడ్డి
- ఈనాడును జనాలు ఎప్పుడో మర్చిపోయారన్న విజయసాయి
- రాము అంటూ రామోజీపై విమర్శనాస్త్రాలు
- చెత్తరాతలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్యలు
విశాఖ దసపల్లా భూముల విషయంలో తనపై మీడియాలో తీవ్రస్థాయిలో కథనాలు రావడం పట్ల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా ఓ మీడియా సంస్థ అధిపతిని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయనను 'రాము' అని సంబోధిస్తూ వరుస ట్వీట్లు చేశారు.
ఈనాడును నెం.1 పత్రికగా నిలపాలని కలలు కన్నవాడివి... కులం, ఆస్తుల కోసం 'సిగ్గుబిళ్ల'ను తాకట్టు పెట్టావు కదా రాము అంటూ ధ్వజమెత్తారు. దక్షిణాదిలో మలయాళ మనోరమ దినపత్రిక 20 లక్షల కాపీలతో దూసుకెళుతోందని, చెత్తరాతలను అసహ్యించుకుని ప్రజలు 'ఈనాడు'ను ఏనాడో మర్చిపోయారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
రాజధాని కోసం అసైన్డ్ భూములను టీడీపీ ప్రభుత్వం లాక్కుంటుందని బెదిరించి ఎస్సీ, ఎస్టీల నుంచి చిల్లరకు కొట్టేసిన 1,100 ఎకరాల గురించి రాశావా రాము? అని ప్రశ్నించారు. ఇందులో నారాయణ, లోకేశ్ సన్నిహితులే ఉన్నారు... అసైన్డ్ భూములు కొన్నవారికి బాబు జీవో 41/2016 ద్వారా ప్లాట్లు ఇవ్వడం దుర్మార్గం అనిపించలేదా? అని నిలదీశారు.
ఏమీ లేని చోట నిప్పు రాజేసి చంద్రబాబులో వేడి రగిలించాలని రాము కులమీడియా ప్రయత్నిస్తోందని విజయసాయిరెడ్డి విమర్శించారు. నీచపు రాతలను ప్రశ్నిస్తే గొలుసులు విప్పి టీడీపీ కుక్కలను వదులుతారని, వాటి మొరుగుళ్లకు ప్రజలే చెప్పు దెబ్బలతో జవాబు చెబుతారని స్పష్టం చేశారు.