YSRCP: వివేకా హత్య కేసు విచారణ ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నారు: దస్తగిరి
- పులివెందులలో మీడియా సమావేశం పెట్టిన దస్తగిరి
- అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి లందరూ ఒకే కుటుంబమని వ్యాఖ్య
- తనపై కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన వైనం
వైసీపీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి గురువారం ఈ కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నారంటూ అతడు ఆరోపించారు. ఈ మేరకు గురువారం పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన దస్తగిరి తనకు ప్రాణ హాని ఉందంటూ మరోమారు ఆందోళన వ్యక్తం చేశాడు.
తనకు ముప్పు తలపెట్టేందుకు కుట్ర జరుగుతోందని దస్తగిరి ఆరోపించాడు. ఈ క్రమంలో తన ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత అని పేర్కొన్నాడు. ప్రభుత్వ అధికారులు సీఎం జగన్ చెప్పిన మాటే వింటారు కాబట్టే తన రక్షణ బాధ్యత జగన్‌దేనని అంటున్నానన్నాడు. అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి అందరూ ఒకే కుటుంబ సభ్యులని తెలిపాడు. తనను ఏమైనా చేస్తారేమోననే భయం తనను వెంటాడుతోందన్నాడు. పెద్దవాళ్లనే కీలు బొమ్మలుగా చేసి ఆడిస్తున్న కొందరికి తానో లెక్క కాదన్నాడు.
తనకు ప్రాణ భయం ఉందన్న దస్తగిరి... తనకు రక్షణ కల్పించాలని కోరాడు. తనకు కేటాయించిన గన్మన్లను ఎందుకు మార్చారని మాత్రమే ఎస్పీకి ఫిర్యాదు చేశానన్న దస్తగిరి...తాను చేసిన వ్యాఖ్యలన్నీ అసత్యాలని ఎస్పీ చెప్పడం బాధాకరమన్నాడు. సమస్య తనదని, ఎలాంటి కుట్ర జరుగుతుందో తనకే తెలుసునని కూడా దస్తగిరి వ్యాఖ్యానించాడు.