Mallikarjuna Kharge: పార్టీలో సమానత్వం చూపించడం లేదంటూ థరూర్ చేసిన వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గే స్పందన
- మరి కొన్నిరోజుల్లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు
- పార్టీ నేతల నుంచి సహకారం అందడంలేదన్న థరూర్
- ఖర్గేకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణ
- తామిద్దరి మధ్య విభేదాలు లేవన్న ఖర్గే
- అన్నదమ్ముల్లాంటి వాళ్లమని వ్యాఖ్యలు
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో సమానత్వం చూపించడంలేదని, తన ప్రత్యర్థి మల్లికార్జున ఖర్గేకు ఇస్తున్నంత ప్రాధాన్యత తనకు ఇవ్వడంలేదని శశి థరూర్ ఆరోపించడం తెలిసిందే. దీనిపై మల్లికార్జున ఖర్గే స్పందించారు.
తనకు, థరూర్ కు మధ్య ఎలాంటి శత్రుత్వంలేదని స్పష్టం చేశారు. తామిద్దరం అన్నదమ్ముల్లాంటి వాళ్లమని, తమ మధ్య విభేదాలు లేవని పేర్కొన్నారు. "కొందరు భిన్నంగా మాట్లాడతారు, దానిపై నేను మరో విధంగా స్పందించగలను... కానీ థరూర్ తో నాకు ఎలాంటి సమస్యలు లేవు" అంటూ ఖర్గే వ్యాఖ్యానించారు.
మరో నాలుగు రోజుల్లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనుండగా, 80 ఏళ్ల మల్లికార్జున ఖర్గే ఫేవరెట్ గా కనిపిస్తున్నారు. ఖర్గే, థరూర్ ఇద్దరికీ తమ ఆశీస్సులు ఉన్నాయని కాంగ్రెస్ హైకమాండ్ చెబుతున్నప్పటికీ, పలువురు నేతలు ఖర్గే వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలోనే శశి థరూర్ తన అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కారు.