Zoom: కశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదుల హతం... వీరమరణం పొందిన సైనిక జాగిలం 'జూమ్'

Army dog Zoom dies of injuries

  • అనంత్ నాగ్ జిల్లాలో ఎన్ కౌంటర్
  • కార్డన్ అండ్ సెర్చ్ చేపట్టిన సైన్యం
  • టెర్రరిస్టులను పసిగట్టిన జాగిలం
  • కాల్పులు జరిపిన టెర్రరిస్టులు
  • బుల్లెట్ గాయాలతోనూ పోరాడిన 'జూమ్'

జమ్మూ కశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చడంలో కీలకంగా వ్యవహరించిన మిలిటరీ జాగిలం 'జూమ్' కన్నుమూసింది. ఉగ్రవాదులతో పోరు సందర్భంగా జూమ్ కు బుల్లెట్ గాయాలయ్యాయి. 

'జూమ్' ను హుటాహుటీన శ్రీనగర్ లోని అడ్వాన్స్డ్ ఫీల్డ్ వెటర్నరీ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. రెండు బుల్లెట్లు తగలడంతో 'జూమ్' కు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. అయినప్పటికీ ఆ సైనిక జాగిలం కోలుకోలేకపోయింది. చికిత్స పొందుతూ మరణించినట్టు సైన్యం వెల్లడించింది. 

అనంత్ నాగ్ జిల్లాలోని తంగ్ పవాస్ ప్రాంతంలో ఓ ఇంట్లో లష్కరే తోయిబా తీవ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో సైన్యం రంగంలోకి దిగింది. సైన్యం తమతో పాటు అటాకింగ్ డాగ్ 'జూమ్' ను కూడా తీసుకువచ్చింది. టెర్రరిస్టులను పసిగట్టిన 'జూమ్' వారిపై దాడికి దిగగా, ఆ టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. రెండు బుల్లెట్లు తగిలినప్పటికీ 'జూమ్' వెనుదిరగకుండా పోరాటం కొనసాగించి, ఆ ముష్కరులు తప్పించుకోకుండా కట్టడి చేసింది. 

గాయాలపాలైన జూమ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించామని, శస్త్రచికిత్స అనంతరం కోలుకున్నట్టే కనిపించిందని, అయితే ఈ ఉదయం ఉన్నట్టుండి ఎగశ్వాస తీసుకుంటూ, ప్రాణాలు విడిచిందని ఓ సైనికాధికారి వెల్లడించారు.

  • Loading...

More Telugu News