Rahul Gandhi: కర్ణాటక పంట పొలాల్లో రాహుల్ గాంధీ... వేరుశనగ రైతుల సమస్యలపై ఆరా
- కర్ణాటకలో కొనసాగుతున్న రాహల్ గాంధీ యాత్ర
- వేరుశనగ పంటచేలోకి దిగిన రాహుల్ గాంధీ
- కాంగ్రెస్ పార్టీతో వేరుశనగకు విడదీయరాని బంధముందని వెల్లడి
- స్వాతంత్య్ర సమరంలో వేరుశనగ కాయల కవచాన్నిసమాచార పంపిణీకి వాడుకున్న తీరును చెప్పిన వైనం
భారత్ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం కర్ణాటకలో సాగుతున్న సంగతి తెలిసిందే. యాత్రలో భాగంగా గురువారం రాష్ట్రంలోని మలహళ్లిలోని వేరుశనగ పంట పొలాల్లోకి దిగారు. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌తో కలిసి పంట పొలాల్లోకి దిగిన రాహుల్... వేరుశనగ మొక్కలను పీకి వాటి ఫల సాయాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన వేరుశనగ రైతులతో ముచ్చటించారు. వేరుశనగ సాగులో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా వేరుశనగతో కాంగ్రెస్ పార్టీకి విడదీయలేని బంధం ఉందని రాహుల్ అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా వేరుశనగను ఏ రీతిని వినియోగించిన తీరును రాహుల్ ప్రస్తావించారు. గింజలను తీసేసిన వేరుశనగ కాయల కవచాన్ని స్వాతంత్య్ర సమరయోధులు సమాచార పంపిణీకి వాడుకున్న వైనాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.