Pakistan: పాకిస్థాన్‌లో విషాదం: వరద బాధితుల బస్సుకు మంటలు.. 18 మంది సజీవ దహనం
- పునరావాస కేంద్రం నుంచి స్వస్థలాలకు బయలుదేరిన వరద బాధితులు
- బస్సు వెనక భాగంలో అంటుకున్న మంటలు
- ప్రమాద సమయంలో బస్సులో 35 మంది
- మరో 10 మందికి తీవ్ర గాయాలు
పాకిస్థాన్‌లోని కరాచీలో తీవ్ర విషాదం నెలకొంది. వరద బాధితులతో వెళ్తున్న బస్సుకు మంటలు అంటుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో 18 మంది సజీవ దహనమయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ వరద బాధితులే. వారికి కరాచీ సమీపంలోని ఎం-9 మోటార్ వే సమీపంలో ఆశ్రయం కల్పించారు. పాక్‌లో వరదలు తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో వారంతా తిరిగి బస్సులో సొంత జిల్లా దాదుకు బయలుదేరారు. ఈ క్రమంలో బస్సు వెనక భాగంలో అంటుకున్న మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించాయి. కొందరు కిటికీల నుంచి దూకి తప్పించుకుని బయటపడ్డారు. మరికొందరు మాత్రం మంటలకు ఆహుతయ్యారు.
ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారని, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాగా, పాకిస్థాన్‌లో ఇటీవల సంభవించిన వరదలు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఆ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా వానలు కురిసి బీభత్సం సృష్టించాయి. దేశంలో దాదాపు సగం భూభాగం వరదల్లో చిక్కుకుంది. అందులో సింధ్ ప్రావిన్సులోని దాదు జిల్లా కూడా ఉంది. తాజా ప్రమాదంలో మరణించిన వారు ఈ జిల్లాకు చెందిన వారే. కాగా, ఆగస్టులో పంజాబ్ ప్రావిన్సులో ఆయిల్ ట్యాంకర్, బస్సు ఢీకొన్న ఘటనలో 20 మంది సజీవ దహనమయ్యారు.