Prakasam District: ఒంగోలులో దారుణం: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వివాహితను ఢీకొట్టి.. అత్యాచారం

Gang Rape in Ongole police searching for Accused
  • రాత్రి పదిన్నర సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న మహిళ
  • నిర్మానుష్య ప్రదేశంలో ఆమె వాహనాన్ని ఢీకొట్టిన నిందితులు
  • కిందపడగానే పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం
  • చేపల చెరువుల వద్ద కాపలాగా పనిచేస్తున్న యువకులే నిందితులని గుర్తించిన పోలీసులు
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వివాహితను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టిన దుండగులు ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాధిత మహిళ ప్రతి రోజూ ద్విచక్ర వాహనంపై ఒంగోలు వచ్చి కూరగాయలు అమ్మి వెళ్తుంటుంది. రోజులానే మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఒంగోలు నుంచి తిరిగి వెళ్తుండగా పూటుగా మద్యం తాగి ఉన్న ఇద్దరు వ్యక్తులు బైక్‌పై ఆమెను వెంబడించారు. నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే ఆమె వాహనాన్ని ఢీకొట్టారు. కిందపడిన ఆమెను పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లారు. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి పరారయ్యారు.

రాత్రి పొద్దుపోతున్నా మహిళ ఇంటికి చేరకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెను వెతుక్కుంటూ బయలుదేరారు. ఈ క్రమంలో ఆమె మధ్యలో తారసపడింది. జరిగిన విషయం వారికి చెప్పింది. దీంతో వారు నిందితుల కోసం గాలించారు. ఈ క్రమంలో కొత్తపట్నం రోడ్డులోని ఓ పెట్రోలు బంకు వద్ద నిందితులు కనిపించారు. వారిని పట్టుకునే లోపే అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో వారు తర్వాతి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొప్పోలు సమీపంలోని చేపల చెరువుల వద్ద కాపలాదారులుగా పనిచేస్తున్నఇద్దరు యువకులే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు గుర్తించారు. వారి కోసం గాలిస్తున్నారు.
Prakasam District
Ongole
Gang Rape
Crime News

More Telugu News