Tamil Nadu: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి భేషరతు క్షమాపణ

Tamil Nadu Minister K ponmudi Say Sorry to Women about his OC comments

  • మహిళలు సిటీ బస్సుల్లో ‘ఓసీ’గా ప్రయాణిస్తున్నారన్న మంత్రి
  • మంత్రిని బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ 
  • ఆ పదాన్ని తమ ప్రాంతంలో హాస్యం కోసం ఉపయోగిస్తారన్న మంత్రి
  • మహిళలు బాధపడి ఉంటే క్షమించాలన్న మంత్రి

మహిళలు కాసింత దూరానికి కూడా సిటీ బస్సులను ఆశ్రయిస్తూ ‘ఓసీ’(ఉచితంగా)గా ప్రయాణిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి మహిళలకు భేషరతు క్షమాపణలు తెలిపారు. మంత్రి ఇటీవల చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రతిపక్ష బీజేపీ ఆయన వ్యాఖ్యలపై విరుచుకుపడింది. మహిళలను కించపరిచేలా మాట్లాడిన మంత్రిని వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని, బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. అన్ని వైపుల నుంచి చుట్టుముడుతున్న విమర్శలతో దిగివచ్చిన మంత్రి పొన్ముడి.. అంబత్తూరు సభలో తాను మాట్లాడిన ‘ఓసీ’ అనే పదం ఇంతటి వివాదానికి కారణం అవుతుందని అనుకోలేదన్నారు.

తన సొంత జిల్లా విల్లుపురం, కడలూరు ప్రాంతాల్లో ఓసీ అనే పదాన్ని హాస్యం కోసం వాడుతుంటారని అన్నారు. మహిళలు సిటీ బస్సుల్లో దర్జాగా ప్రయాణిస్తున్నారని చెప్పడమే తన ఉద్దేశమని అన్నారు. అయితే, బీజేపీ నేతలు మాత్రం పనిగట్టుకుని తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. మహిళలంటే తనకు ఎంతో గౌరవమని, తన వ్యాఖ్యలు వారిని నొప్పించి ఉంటే క్షమించాలని వేడుకున్నారు. కాగా, ఇటీవల ముఖ్యమంత్రి స్టాలిన్ పార్టీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ.. మంత్రులు నోరుజారడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. కాబట్టి ఇకపై ఏ సందర్భంలోనైనా ఆచితూచి మాట్లాడాలని మంత్రులకు హితవు పలికారు.

  • Loading...

More Telugu News