YSR Lifetime Achievement: వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ పురస్కారాల జాబితా సిద్ధం... నవంబరు 1న అవార్డుల ప్రదానం
- గతేడాది నుంచి వైఎస్సార్ పేరిట అవార్డులు
- అవార్డుకు ఎంపికైన వారి పేర్లను ప్రకటించనున్న కమిటీ
- సీఎం జగన్ చేతులమీదుగా అవార్డులు
- ప్రకటన చేసిన ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ
వివిధ రంగాల్లో కృషి చేసినవారికి గతేడాది నుంచి వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డులు ఇస్తున్న సంగతి తెలిసిందే. 2022 సంవత్సరానికి గాను వైఎస్సార్ పురస్కారాలకు ఎంపికైన వారి జాబితా సిద్ధమైంది. నవంబరు 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ ఈ విశిష్ట పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఓ ప్రకటన చేసింది.
వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు కింద గ్రహీతలకు రూ.10 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారు. వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డుగ్రహీతలకు రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారు.
కాగా, ఈ ఏడాది అవార్డులకు ఎంపికైన వారి జాబితాను హైపర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు నేడు ప్రకటించనున్నారు. కళలు, సాహిత్యం, వ్యవసాయం, జర్నలిజం, సామాజిక సేవ, విద్య, వైద్య రంగాల్లో కృషి చేసిన దాదాపు 25 మందితో ఈ జాబితా రూపొందించినట్టు తెలుస్తోంది.