Elephant: మీరేనా.. నేనూ పానీ పూరీ తింటా.. ఏనుగు వీడియో వైరల్
- ట్విట్టర్ లో వీడియోను పోస్ట్ చేసిన ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా
- అసోంలోని తేజ్ పూర్ జిల్లాలో ఏనుగు పానీ పూరీ తిన్న ఘటన
- ‘పానీ పూరీ అంటే ఇష్టపడనివారు ఎవరు?’ అంటూ నెటిజన్ల కామెంట్లు
- కస్టమర్ కు తగ్గట్టు పానీ పూరీ సైజు పెంచాలంటూ సరదా వ్యాఖ్యలు
రోడ్డుపై ఎక్కడైనా పానీ పూరీ బండి కనిపిస్తే చాలు నోరూరుతుంది. ఎప్పుడూ బండి చుట్టూ గ్యాప్ లేకుండా జనాలు నిండే ఉంటారు. అంత డిమాండ్ పానీ పూరీకి. కానీ అసోం లోని తేజ్ పూర్ జిల్లాలో ఓ ఏనుగు పానీ పూరీ తింటున్న వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోడ్డు పక్కన పానీ పూరీ అమ్ముతున్న వ్యక్తి వద్ద ఏనుగు నిలబడి ఉంది. పానీ పూరీ అమ్మే వ్యక్తి వరుసగా ఒక్కోటీ పానీ పూరీలను ఏనుగు తొండానికి అందిస్తుంటే.. వరుసగా గుటుక్కుమనిపిస్తూ వచ్చింది.
అందరి దృష్టిని ఆకర్షిస్తూ..
పానీ పూరీ విక్రయించే వ్యక్తి.. ఏదో సాధారణంగా ఏమీ కాకుండా మనకు ఇచ్చినట్టే పానీ పూరీకి రంధ్రం చేసి, బఠానీ, మసాలా పానీ నింపి అందిస్తూ వచ్చాడు. ఒకటొకటిగా ఏనుగు తినేస్తూ వచ్చింది. పక్కనే ఏనుగు మావటి కూడా నిలబడి గమనిస్తూ ఉన్నాడు. పానీ పూరీ తినడానికి వచ్చిన అమ్మాయిలు ఇది చూసి ఆశ్చర్యంతో నవ్వడం కూడా వీడియోలో కనిపిస్తోంది.
- ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విట్టర్ లొ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘‘పానీ పూరీ అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు” అని కాప్షన్ పెట్టారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 50 వేలకుపైగా వ్యూస్ వచ్చాయి.
- ‘నిజం సార్ బాగా చెప్పారు’, ‘చాలా బాగుందండి’, ‘పానీ పూరీ అంటే నాకూ ఎంతో ఇష్టం’ అంటూ కొందరు.. ‘పానీ పూరి అంటే ఇష్టం ఉండని వారు ఎవరు?’, ‘హర్ దిల్ దివానా హై సర్ (ప్రతి ఒక్కరి మనసు పానీ పూరీ అంటే పిచ్చిదైపోతుంది)’ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
- ‘గజరాజుకు కూడా రుచుల మీద ప్రత్యేక ఆసక్తి వచ్చినట్టుంది’ అని కొందరు.. ‘ఐదారు పీసులు సరిపోవు.. ఐదారు డజన్ల పానీ పూరీలు కావాలి రెడీగా ఉండు’ అంటూ మరికొందరు.. ‘కస్టమర్ కు తగినట్టుగా పానీ పూరీల సైజు పెంచాలని కోరుతున్నాం” అంటూ ఇంకొందరు సరదా కామెంట్లు కూడా చేస్తున్నారు.