YSRCP: వివేకా హత్య కేసును ఏపీ బయట విచారించాలని సుప్రీంలో పిటిషన్... ఏపీ సర్కారుపై ధర్మాసనం ప్రశ్నల వర్షం
- కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్న సుప్రీంకోర్టు
- కేసులోని తీవ్ర ఆరోపణల మేరకు వ్యవహరిస్తున్నారా? అని నిలదీత
- కేసులో ఇంప్లీడ్ చేసుకోవాలన్న వివేకా బంధువు పిటిషన్ కొట్టివేత
- వివేకా కుమార్తె తప్పించి ఇంకెవరి వాదనలు వినబోమని స్పష్టీకరణ
- పిటిషన్పై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసిన కోర్టు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఏపీ బయట విచారించాలంటూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. శుక్రవారం ఈ పిటిషన్పై జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలను సంధించింది. ఈ కేసు దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్న ధర్మాసనం... కేసులోని తీవ్ర ఆరోపణల మేరకు వ్యవహరిస్తున్నారా? అని ప్రశ్నించింది. కోర్టులు సూచించిన మేరకు సాక్షులకు భద్రత కల్పిస్తున్నామని ఏపీ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ తరఫు న్యాయవాదికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తాము కూడా కౌంటర్ దాఖలు చేస్తామన్న ఏపీ ప్రభుత్వ న్యాయవాది... అందుకు ఒకటి, రెండు రోజుల గడువు కావాలని కోరారు. ఈ వ్యవహారంలో తననూ ఇంప్లీడ్ చేయాలంటూ వివేకా బంధువు ఒకరు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా వివేకా కుమార్తె మినహా మరెవరి వాదనలు ఈ వ్యవహారంలో వినాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది. అనంతరం ఈ పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.