Varla Ramaiah: దస్తగిరికి జరగరానిది జరిగితే కడప ఎస్పీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది: వర్ల రామయ్య
- దస్తగిరి ప్రాణాలకు రక్షణ కల్పించలేని దుస్థితిలో ఉన్నారన్న వర్ల
- సీఎం జగన్ పై విమర్శలు
- తప్పటడుగులు తప్పుడు అడుగులుగా మారాయని వ్యాఖ్యలు
- పోలీసులు సీబీఐనే భయపెట్టే స్థాయికి చేరారని ఆరోపణ
వివేకా హత్యకేసు విచారణలో అప్రూవర్ గా మారిన దస్తగిరి ప్రాణాలకు రక్షణ కల్పించలేని దుస్థితిలో కడప పోలీస్ విభాగం, ముఖ్యమంత్రి ఉండటం సిగ్గుచేటని టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు.
సొంత బాబాయ్ హత్యకేసులో జగన్ రెడ్డి ఆదినుంచీ వేసిన తప్పటడుగులు, తరువాత తప్పుడు అడుగులుగా మారాయని విమర్శించారు. రాష్ట్ర డీజీపీ ఏనాడైనా వివేకా హత్య కేసు విచారణ ఏ దశలో ఉందని సమీక్ష చేశారా? అని ప్రశ్నించారు.
సీబీఐ అధికారుల్ని భయపెట్టే స్థాయికి రాష్ట్ర పోలీస్ విభాగం వెళ్లడం ముద్దాయిలపై ముఖ్యమంత్రికి ఉన్న అపార ప్రేమ, ఆప్యాయతానురాగాలకు నిదర్శనం కాదా? అని వర్ల రామయ్య నిలదీశారు. స్థానిక పోలీస్ విభాగం నుంచి తమను కాపాడాలంటూ సీబీఐ వాళ్లు హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి వచ్చిందంటే, అది జగన్ రెడ్డికి, ఆయన పాలనకు సిగ్గుచేటు కాదా? అని ప్రశ్నించారు.
అప్రూవర్ గా మారిన దస్తగిరిని కొత్త పెళ్లికొడుకులా చూడాల్సిన పోలీస్ విభాగం, అతని ప్రాణాలను గాలికి వదిలేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. "పోలీస్ వ్యవస్థపై నమ్మకంలేక తనకు ప్రాణరక్షణ కావాలని దస్తగిరి మొత్తుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? దస్తగిరికి రక్షణ కల్పించలేని ఏపీ పోలీస్ వ్యవస్థ నిజంగా సిగ్గుపడాలి. పోలీస్ వ్యవస్థ సీబీఐ వ్యవస్థకు సహకరించకుండా, కేసు విచారణకు అడ్డు తగులుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కచ్చితంగా న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి.
దస్తగిరి ఐస్ ఫ్యాక్టరీ కి పవర్ కట్ చేయడం, దస్తగిరి తమ్ముడిని కొట్టి, అతనిపైనే కేసు పెట్టడం కక్షసాధించడం కాదా? దస్తగిరిపై ఈగ వాలకుండా చూడాల్సిన బాధ్యత కడప ఎస్పీపైనే ఉంది. అప్రూవర్ కి ఏదైనా జరగరానిది జరిగితే ఎస్పీ అన్బురాజన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ కేసుల్లో వాదనలు వినిపించే న్యాయవాదిని వివేకా హత్య కేసులో ముద్దాయిగా ఉన్న శివశంకర్ రెడ్డికి లాయర్ గా పెట్టడమేంటి? ఎవరు పెట్టారో ప్రజలకు తెలియదనుకుంటున్నారా? దాని వెనుక ప్రభుత్వం ఉన్నట్లు కాదా? శివశంకర్ రెడ్డి... తన తరుపున వాదించే న్యాయవాదికి రూ.50 లక్షలు ఇచ్చేంత స్థితిమంతుడా?" అంటూ వర్ల రామయ్య ప్రశ్నల వర్షం కురిపించారు.