Reliance: క్రికెట్ ఫ్యాన్స్ కు షాక్.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో కూడిన రిచార్జ్ ప్లాన్స్ ను తొలగించిన జియో
- ఇప్పటిదాకా తమ ప్లాన్ తో పాటు హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ కూడా ఇచ్చిన జియో
- టీ20 ప్రపంచ కప్ ముంగిట ప్లాన్స్ ను మార్చుతూ నిర్ణయం
- సొంతంగా స్పోర్ట్స్ 18 చానెల్ ను తీసుకొచ్చిన రిలయన్స్
మొబైల్ లో క్రికెట్ మ్యాచ్ లు చూసే అభిమానులకు రిలయన్స్ జియో షాకిచ్చింది. క్రికెట్ మ్యాచ్ లు ఎక్కువ లైవ్ స్ట్రీమ్ అవుతున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ను అందించే తమ ప్రీపెయిడ్ ప్లాన్లను తొలగించింది. ఇప్పటిదాకా జియో.. హాట్ స్టార్ వీఐపీ, హాట్ స్టార్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్లతో ప్లాన్స్ ను వినియోగదారులకు అందిస్తూ వచ్చింది. రూ. 449 నుంచి వీఐపీ, రూ.1499 నుంచి ప్రీమియం సబ్ స్ర్కిప్షన్ అందిస్తోంది. వీటికి తోడు నిర్ణీత కాలానికి రోజువారీ నిర్దేశిత డేటాతో పాటు ఉచిత కాల్స్, మెసేజీల సదుపాయాన్ని తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. కానీ, ఉన్నట్టుండి ఇప్పుడు హాట్ స్టార్ ఆప్షన్ ను తమ రీఛార్జ్ ప్లాన్ జాబితా నుంచి తొలగించి ఆశ్చర్యపరించింది.
ఈ ఆదివారం నుంచి టీ20 ప్రపంచ కప్ ముంగిట జియో ఈ నిర్ణయం తీసుకోవడంతో క్రికెట్ అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. జియో మాతృసంస్థ రిలయన్స్ .. స్పోర్ట్స్ 18 పేరుతో సొంతంగా స్పోర్ట్స్ చానల్ ను ప్రారంభించింది. వూట్ యాప్ లో నూ ఈ చానల్ కంటెంట్, స్ర్టీమింగ్ ను అందుబాటులో ఉంచింది. అలాగే ఐపీఎల్ మీడియా డిజిటల్ హక్కులను రిలయన్స్ సొంతం చేసుకుంది. వచ్చే ఐదేళ్ల కాలానికి భారీ మొత్తంతో వీటిని కొనుగోలు చేసింది. భారత క్రికెట్ జట్టు ఆడే అంతర్జాతీయ మ్యాచ్ ల ప్రసార హక్కులతో పాటు ఇతర ఆటల ప్రసార హక్కులను కొనుగోలు చేసే ఆలోచనలో రిలయన్స్ ఉంది. ఈ నేపథ్యంలో తమ స్పోర్ట్స్ 18కి పోటీదారు అయిన స్టార్ నెట్ వర్క్ కు చెందిన హాట్ స్టార్ తో టై అప్ ను జియో రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.