Kerala: అదృష్టం ఇతనిదే.. అప్పు కట్టాలని బ్యాంకు నోటీసు.. గంటన్నరలో రూ. 70 లక్షల లాటరీ
- కేరళలో చేపలు అమ్ముకునే వ్యక్తికి జాక్ పాట్
- ఇల్లు కోసం తీసుకున్న లోను కట్టాలని 2 గంటలకు బ్యాంక్ నుంచి నోటీసు
- 3.30 కి లాటరీ సందేశం రావడంతో మారిన తలరాత
అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదేనేమో. తీసుకున్న అప్పు తీర్చలేదని బ్యాంకు నుంచి నోటీసులు చూసి దిగాలుగా ఉన్న ఓ వ్యక్తి కొన్ని నిమిషాల్లోనే రూ. 70 లక్షల లాటరీ గెలిచిన వార్త తెలిసి ఎగిరి గంతేశాడు. సినిమాను తలపించే సీన్ కేరళలో నిజమైంది. కేరళలో చేపలు పట్టుకుని, అమ్ముకునే పూకుంజు అనే వ్యక్తిని ఈ అదృష్టం వరించింది. ఉత్తర మైనగపల్లిలో స్కూటర్‌పై చేపలు అమ్ముకునే పూకుంజు చాన్నాళ్ల నుంచి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇంటి నిర్మాణం కోసం బ్యాంకులో రూ.9 లక్షలు అప్పు తీసుకున్న అతను బాకీ తీర్చలేకపోయాడు.
దాంతో, వెంటనే అప్పు చెల్లించలేదని బ్యాంకు అతనికి నోటీసు ఇచ్చింది. అతన్ని డిఫాల్టర్‌గా గుర్తించిన బ్యాంక్ అసలు 9 లక్షలుకు వడ్డీతో కలిపి మొత్తం రూ. 12 లక్షలు చెల్లించాలి. లేదంటే ఇంటిని జప్తు చేస్తామని నోటీసులో పేర్కొంది. ఈ నోటీసు చూసి దిగాలుగా చేపల వేటకు వెళ్తున్న సమయంలో అతనికి మరో సందేశం వచ్చింది. ఈ నెల 12వ తేదీన కొన్న లాటరీకి మొదటి బహుమతిగా రూ. 70 లక్షలు లభించినట్టు తెలిసింది. అంతే గంటన్నరలో అతని తలరాత మొత్తం మారిపోయింది. దాంతో, పూకుంజు, అతని భార్య, కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.