YSRCP: కళాతపస్వికి వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు...నటుడు ఆర్.నారాయణమూర్తికి కూడా
- ఆర్.నారాయణమూర్తికీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
- నాయుడు గోపి, పిచ్చుక శ్రీనివాస్‌లకు అచీవ్ మెంట్ అవార్డులు
- వ్యవసాయం, సాహిత్య సేవ, మహిళా సాధికారతల్లోనూ అవార్డుల ప్రకటన
- నవంబర్ 1న అవార్డులను ప్రదానం చేయనున్న సీఎం జగన్
వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న డాక్టర్ వైఎస్సార్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్, డాక్టర్ వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుల గ్రహీతల జాబితా విడుదలైంది. ఈ మేరకు శుక్రవారం ఏపీ ప్రభుత్వం అవార్డు గ్రహీతల పేర్లను వెల్లడించింది. కళలు- సంస్కృతి విభాగంలో కళాతపస్వి, సినీ దర్శకుడు కె.విశ్వనాథ్‌తో పాటు నటుడు ఆర్.నారాయణ మూర్తికి వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్ మెంట్ అవార్డులను ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇక ఇదే రంగంలో రంగస్థల కళాకారుడు నాయుడు గోపి, కళంకారి నేతన్న పిచుక శ్రీనివాస్, షేక్ గౌసియా బేగంలను వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులకు ఎంపిక చేశామని తెలిపింది.
సాహిత్య సేవా విభాగంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, ఎమెస్కో ప్రచురణాలయం, రచయిత శాంతి నారాయణలకు వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు దక్కాయి. వ్యవసాయ విభాగంలో ఆదివాసీ కేష్యూనట్స్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీకి చెందిన సోడెం ముక్కయ్య, కుశలవ కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీకి చెందిన గోపాలకృష్ణ, అన్నమయ్య మూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌కు చెందిన జయబ్బనాయుడు, అమృత ఫల ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీకి చెందిన మౌక్తిక, కట్టమంచి బాలకృష్ణారెడ్డిలు వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులకు ఎంపికయ్యారు.
మహిళా సాధికారత, రక్షణ విభాగం కింద ప్రజ్వలా ఫౌండేషన్‌కు చెందిన సునీతా కృష్ణన్‌తో పాటు శిరీష రీహాబిలిటేషన్ సెంటర్, దిశ పోలీసింగ్‌లను వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. దిశ పోలీసింగ్‌లో ఫిర్యాదు అందిన నిమిషాల్లో స్పందించిన ఐదుగురు పోలీసులకు అచీవ్‌మెంట్ అవార్డులు దక్కాయి. ఈ అవార్డులను రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 1న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రహీతలకు అందజేయనున్నారు.