La Vangaurida: పాములు ఆడించే వ్యక్తి కారికేచర్ తో భారత ఆర్థికాభివృద్ధిపై కథనం... స్పెయిన్ పత్రికపై ఆగ్రహావేశాలు
- సుస్థిర పురోగామి పథంలో భారత ఆర్థిక వ్యవస్థ
- ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
- భారత్ ఆర్థికాభివృద్ధిపై లాన్ వాన్ గార్డియాలో కథనం
- వివక్షపూరితం, అవమానకరం అంటూ భారత ప్రముఖుల విమర్శలు
గత కొన్నేళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థ సుస్థిర అభివృద్ధితో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. జీడీపీ పరంగా బ్రిటన్ ను అధిగమించిన భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, స్పెయిన్ దినపత్రిక 'లా వాన్ గార్డియా' కూడా భారత ఆర్థికాభివృద్ధిపై ఓ వివరణాత్మక కథనం ప్రచురించింది. ఈ కథనానికి 'ది అవర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ' అనే హెడ్డింగ్ పెట్టింది.
అయితే, భారత ఆర్థిక వ్యవస్థ ఏవిధంగా పైకెగసింది అనేది సోదాహరణంగా చూపించడానికి ఓ పాములు ఆడించే వ్యక్తి కారికేచర్ ను ఉపయోగించింది. దాంతో, ఈ పత్రికపై భారత్ వర్గాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
బెంగళూరు సెంట్రల్ బీజేపీ ఎంపీ పీసీ మోహన్ దీనిపై స్పందించారు. భారతదేశ దృఢమైన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ గుర్తింపు పొందిందని తెలిపారు. అయితే స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా భారతీయులను పాములు ఆడించేవారిగా చూపించే మనస్తత్వాలు పోలేదని విమర్శించారు. ఇంతకంటే మూర్ఖత్వం ఉండదని పేర్కొన్నారు. ఇలాంటి విదేశీ మనస్తత్వాలను రూపుమాపడం చాలా కష్టం అని అభిప్రాయపడ్డారు.
స్టాక్ మార్కెట్ నిపుణుడు, డిమ్యాట్ అకౌంట్ల సంస్థ జెరోధా సీఈవో నితిన్ కామత్ కూడా స్పెయిన్ పత్రిక కథనంపై స్పందించారు. భారత్ ను మిగతా ప్రపంచం గుర్తించడం వరకు బాగానే ఉంది... కానీ ఓ పాములు ఆడించే వ్యక్తి కారికేచర్ తో భారత్ ప్రాతినిధ్యాన్ని చిత్రించాలన్న ప్రయత్నం అవమానకరం అని నితిన్ కామత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రచయిత రజత్ సేథీ సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ తన సత్తా చాటుకుంటున్నప్పటికీ, భారతీయులంటే పాములు ఆడించేవారు అన్నట్టుగా జాతివివక్షతో కూడిన తప్పుడు చిత్రణ చేస్తున్నారని విమర్శించారు. అటు, సోషల్ మీడియాలో కూడా స్పెయిన్ పత్రిక లాన్ వాన్ గార్డియాపై నెటిజన్లు మండిపడుతున్నారు.