Arjun Tendulkar: దేశవాళీ క్రికెట్లో నిప్పులు చెరిగిన సచిన్ తనయుడు
- ముంబయి జట్టు నుంచి గోవాకు మారిన అర్జున్ టెండూల్కర్
- సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గోవాకు ప్రాతినిధ్యం
- హైదరాబాదు జట్టుతో మ్యాచ్
- 4 ఓవర్లలో 4 వికెట్లు తీసిన వైనం
టీమిండియాకు ఆడాలన్న కలను సాకారం చేసుకునేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఎడమచేతివాటం పేస్ బౌలర్ అయిన అర్జున్ టెండూల్కర్ దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నిప్పులు చెరిగే బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు.
ముంబయి జట్టులో పోటీ తీవ్రంగా ఉండడంతో, ఈ సీజన్ లో అర్జున్ గోవా జట్టు తరఫున బరిలో దిగాడు. హైదరాబాద్ జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్ లో ఈ పొడగరి పేసర్ 4 ఓవర్లలో 10 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం విశేషం.
ఈ మ్యాచ్ లో గోవా ఓడిపోయినప్పటికీ అర్జున్ బౌలింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. దేశవాళీ కెరీర్ లో అర్జున్ కు ఇవే అత్యుత్తమ గణాంకాలు. కాగా, అర్జున్ టెండూల్కర్ కు ప్రస్తుతం యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ మార్గదర్శనం చేస్తున్నట్టు తెలుస్తోంది.