Andhra Pradesh: అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవద్దని చెబుతున్నాం: డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి

AP DGP Press meet in Amaravati on Farmers foot march

  • రైతుల పాదయాత్ర సవ్యంగా సాగుతోందన్న డీజీపీ
  • రైతుల పాదయాత్రకు అదనపు బందోబస్తు కల్పించామని వివరణ
  • దస్తగిరికి రక్షణ కల్పించినట్టు చెప్పిన రాజేంద్రనాథ్‌రెడ్డి

కావాలంటే నిరసన చేసుకోవచ్చు కానీ అమరావతి రైతుల పాదయాత్రను మాత్రం అడ్డుకోవద్దని నిరసనకారులకు చెబుతున్నామని ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న వారిని యాత్ర సాగుతున్న జిల్లా ఎస్పీ ముందుగానే పిలిపించి ఈ విషయాన్ని చెప్పారని పోలీస్ బాస్ తెలిపారు. నిరసనలు తెలుపుతున్న వారిని ముందుగానే పిలిపించి యాత్రను అడ్డుకోవద్దని చెబుతున్నామని, కావాలంటే నిరసన తెలుపుకోవచ్చని చెప్పామని, అందుకు వారు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు అయితే ఎక్కడా తీవ్ర సమస్యలు ఎదురుకాలేదని అన్నారు. ఎక్కడైనా అలా జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు. 

రైతుల పాదయాత్ర కొన్ని చోట్ల ఉద్రిక్తంగా మారడానికి పోలీసులే కారణమన్న వార్తలు వినిపిస్తున్నాయి కదా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ఆ వార్తల్లో నిజం లేదని, అది పూర్తిగా అబద్ధమని అన్నారు. తాము సమస్యను పరిష్కరించేందుకే ప్రయత్నిస్తాం తప్పితే, దానిని మరింత జటిలం చేయబోమన్నారు.  అడ్డంకులు సృష్టించడానికి తమకేం పని అని ప్రశ్నించారు. శాంతి భద్రతల పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. పాదయాత్ర ఇప్పటి వరకు ప్రశాంతంగానే సాగిందని, అదనపు బందోబస్తు కూడా కల్పించామని, కాబట్టి పాదయాత్రపై ఆందోళన అవసరం లేదని అన్నారు. 

ప్రతిపక్ష నాయకులను అసభ్యంగా దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిపై కేసులు పెట్టకుండా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చిన్న పోస్టు పెట్టినా కేసులు పెడుతున్నారని, ఈ ఏకపక్ష ధోరణి ఎందుకన్న విలేకరుల ప్రశ్నకు డీజీపీ బదులిస్తూ.. అలాంటి ఘటనలు ఏవైనా ఉంటే తమకు వివరాలిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో జరిగిన పలు హత్య కేసుల్లో పోలీసుల ప్రమేయం కూడా ఉన్నట్టు వస్తున్న వార్తలపై మీ స్పందనేంటన్న ప్రశ్నకు.. ఎక్కడైనా ఇలాంటివి గుర్తిస్తే వారిపై చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి రక్షణ కల్పిస్తున్నట్టు మరో ప్రశ్నకు సమాధానంగా డీజీపీ పేర్కొన్నారు. మంగళగిరిలో పోలీసు ప్రధాన కార్యాలయంలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News