jinping: 'జిన్ పింగ్ దేశ ద్రోహి' అంటూ బీజింగ్ లో నిరసన
- మూడో సారి అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్న జిన్ పింగ్
- నియంతృత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
- జిన్ పింగ్ ను దించేయండి అంటూ బీజింగ్ లో పోస్టర్
చైనా అధినేత జిన్ పింగ్ కు ఎప్పుడూ లేని విధంగా సొంత దేశంలో నిరసన సెగ తగులుతోంది. ఇప్పటికే రెండు సార్లు అధ్యక్షుడిగా వ్యవహరించిన జిన్ పింగ్... మూడో సారి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించేందుకు రెడీ అవుతున్నారు. రేపు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో జిన్ పింగ్ ను మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధమయింది. చైనాలో అధ్యక్షుడిని ప్రజలు ఎన్నుకోరు. పార్టీనే అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది.
ఈ నియంతృత్వ తరహా పాలనపై చైనా ప్రజల్లో ఎప్పటి నుంచో అసంతృప్తి ఉంది. అయితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం, సమ్మెలు చేయడం అక్కడ ఉండదు. ప్రభుత్వానికి, అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి చైనాలో ఇప్పుడు ప్రజలు నిరసనను వ్యక్తం చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
ఈ క్రమంలో ఏకంగా జిన్ పింగ్ కు వ్యతిరేకంగా బీజింగ్ లోని నాలుగు రోడ్ల కూడలిలో బ్యానర్ కట్టారు. నియంత జిన్ పింగ్ ను దించేయండి.. జిన్ పింగ్ దేశ ద్రోహి అని బ్యానర్ లో పేర్కొన్నారు. మాకు కోవిడ్ పరీక్షలు, దిగ్బంధనం వద్దు... ఆహారం కావాలి, స్వేచ్ఛ కావాలి అని రాశారు. అబద్ధాలు మాకు వద్దు... గౌరవ మర్యాదలు కావాలని పేర్కొన్నారు. మహా నేత మాకు అవసరం లేదు... ఎన్నికలు జరగాలి అని రాశారు. బానిసలుగా ఉండకండి... పౌరులుగా జీవించండి అని రాశారు.