diabetes: ఆహారంతో మధుమేహం పూర్వపు స్థితికి వెళ్లిపోవచ్చా?
- అందరికీ ఇది సాధ్యపడుతుందని చెప్పలేమంటున్న వైద్యులు
- దీనిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు
- 10-20 శాతం మందిలో ఫలితాలు ఉంటాయని వెల్లడి
రక్తంలో గ్లూకోజు ఒక పరిమితి దాటి ఉంటుంటే దాన్ని మధుమేహంగా చెబుతారు. మధుమేహం రావడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. 12 గంటల ఫాస్టింగ్ తర్వాత ఉదయం తీసుకునే రక్త నమూనాలో షుగర్ 99ఎంజీ, అంతకు తక్కువ ఉంటే దాన్ని సాధారణంగా చూస్తారు. అంటే మధుమేహం లేనట్టు. 100-125 మధ్య రీడింగ్ వస్తే మధుమేహానికి ముందు దశలోకి వచ్చినట్టుగా పరిగణిస్తారు. ఇక 126కు పైన ఉంటే దాన్ని మధుమేహంగానే చూస్తారు.
ఉపవాసం ఉండడం, తీపి మానేయడం, ఆహారాల్లో మార్పులు చేసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. అంటే తక్కువ ఉండేలా చూసుకోవచ్చు. మరి నిజానికి ఒకసారి మధుమేహం బారిన పడితే, ఆహారాల్లో మార్పులతో దాన్ని శాశ్వతంగా రాకుండా చూసుకోవచ్చా..? మధుమేహం పూర్వపు స్థితికి చేరుకోలేమా? దీనిపై ఫోర్టిస్ సీడీవోసీ సెంటర్ ఫర్ డయాబెటిస్ చైర్మన్ అనూప్ మిశ్రా వివరాలు అందించారు.
‘‘దశాబ్దం కిందట మధుమేహం నుంచి బయటకు రావడాన్ని అద్భుతంగా వైద్యులు పరిగణించేవారు. మధుమేహం విషయంలో శరీర శాస్త్రం గురించి తగినంత విజ్ఞానం లేకపోవడంతో ఇదొక కలగానే ఉండేది. పరిశోధన మరింత పురోగతి చెందడంతో మధుమేహం విషయంలో కాలేయం పాత్రపై స్పష్టత వచ్చింది.
ఒక వ్యక్తి శాచురేటెడ్ ఫ్యాట్స్ ను, కేలరీలను అధికంగా తీసుకున్నప్పుడు, లివర్ ఫ్యాట్ కణాలు భారీగా పెరిగిపోతాయి. లివర్ అంతటా ఫ్యాట్ నిండుకున్నప్పుడు క్రీమ్ వంటి ద్రవాన్ని రక్తంలోకి విడుదల చేస్తుంది. దీన్ని ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఇది కండరాల్లో, పాంక్రియాస్ లో, గుండె ధమనుల్లో పేరుకుంటుంది. దీంతో పాంక్రియాస్ ఇన్సులిన్ తయారీ సామర్థ్యంపై ప్రభావం పడుతుంది. ఫలితంగా శరీరంలో ఇన్సులిన్ స్థాయి తగ్గిపోతుంది. దాంతో రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోతుంది.
ఇక ఈ క్రీమ్ వంటి ద్రావకాన్ని శరీర భాగాల నుంచి ఎలా తొలగించాలి? పరిశోధనలో భాగంగా బ్రిటన్ లో 12 మంది మధుమేహం రోగులకు కేలరీలు తక్కువగా ఉన్న లిక్విడ్ ఆహారాన్ని ఎనిమిది వారాల పాటు ఇచ్చారు. కొన్ని రోజులకే రక్తంలో గ్లూకోజ్ సాధారణ స్థాయికి వచ్చేసింది. దీంతో పరిశోధకులే ఆశ్చర్యపోయారు. కాలేయం, పాంక్రియాస్ లో పేరుకున్న ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ లో సగం 4-6 వారాల్లో తగ్గిపోయాయి. వారికి కొంత కాలం పాటు మందులు కూడా ఇవ్వలేదు.
ఇలా ఎంత కాలం పాటు, జీవితాంతం మధుమేహం లేకుండా చూసుకోవచ్చా? దీన్ని తెలుసుకునేందుకు బ్రిటన్ లోనే మరో పరిశోధన కూడా జరిగింది. 12-20 వారాల పాటు చాలా తక్కువ కేలరీల ఆహారం ఇచ్చి చూశారు. 10-15 కిలోల బరువు తగ్గిన వారిలో మధుమేహం కనిపించలేదు. అంటే రక్తంలో గ్లూకోజ్ సాధారణ స్థాయికి తగ్గిపోయింది. కానీ, వీరిలో తిరిగి కొందరు ఏడాది విరామంతో మళ్లీ మధుమేహంలోకి వెళ్లిపోయినట్టు గుర్తించారు.
కనుక మధుమేహం ఉన్న అందరికీ పూర్వపు స్థితికి తీసుకెళతామని అనుకోవడం సరికాదు. కేవలం 10-20 శాతం మంది రోగుల్లోనే వ్యాధి లక్షణాలు లేకుండా చేసుకోవడం సాధ్యపడుతుంది. తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవాలి. అలాగే, కార్బోహైడ్రేట్లు తక్కువ ఉండాలి. అధిక ఫ్యాట్ లేదా ప్రొటీన్ తీసుకోవాలి. వీలైనంత బరువు తగ్గాలి’’ అని డాక్టర్ వివరించారు.