Nakka Anand Babu: 67 కంపెనీలకు అధిపతిగా ఉన్న జగన్ ప్రజాసేవకు పనికొస్తాడా అని ధర్మాన అనలేదా?: నక్కా ఆనంద్ బాబు

Nakka Anand Babu fires on Dharmana and other ministers

  • ముదిరిన రాజధాని రగడ
  • ఓవైపు అమరావతి రైతుల పాదయాత్ర
  • నేడు విశాఖలో వైసీపీ గర్జన
  • ధర్మాన, ఇతర మంత్రులపై ఆనంద్ బాబు విమర్శలు

తాము, తమ బినామీలు, తమ కుటుంబాలు కొట్టేసిన భూములు, ఆస్తుల్ని కాపాడుకోవడానికే ధర్మాన ప్రసాదరావు, ఇతర ఉత్తరాంధ్ర మంత్రులు, ఆ ప్రాంత వాసుల్ని రెచ్చగొడుతూ, జగన్ రెడ్డి మూడుముక్కలాటకు వంతపాడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. 

నక్కా ఆనంద్ బాబు ఇవాళ మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాంధ్రపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తూ, సూక్తులు చెబుతున్న ధర్మాన ప్రసాదరావు వైసీపీలో ఉండి తన ప్రాంతానికి ఏం ఒరగబెట్టాడో చెప్పాలని నిలదీశారు. సీబీఐ ఛార్జ్ షీట్లలో ఒక దానిలో ముఖ్యమంత్రి జగన్ ఒకటో ముద్దాయిగా (ఏ1) ఉంటే, ధర్మాన ప్రసాదరావు 5వ ముద్దాయి (ఏ5) గా ఉన్నాడని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి సహా ముద్దాయిగా ఉన్న ధర్మాన పెద్ద నీతిమంతుడిలా ఇప్పుడు మాట్లాడుతున్నాడని విమర్శించారు. 

"గతంలో ఇదే ధర్మాన ప్రసాదరావు జగన్మోహన్ రెడ్డి గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ, '67 కంపెనీలకు అధిపతిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటున్నాడు. అలాంటి వ్యాపారధోరణితో ఆలోచించే వ్యక్తి ప్రజలకు సేవచేస్తాడా, తండ్రి పదవిని అడ్డంపెట్టుకొని జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని తాపత్రయపడుతున్నాడు' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయలేదా?" అని నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు.

"మాజీ సైనికోద్యోగుల భూముల్ని దిగమింగిన ధర్మాన వాటిని కాపాడుకోవడానికే విశాఖ రాజధాని అంటున్నాడు. ధర్మాన నేతృత్వంలో జరిగిన భూదోపిడీని సిట్ విభాగం తప్పుపట్టింది కూడా. పలువురు ఐఏఎస్ లు, సబ్ రిజిస్ట్రార్ల పాత్ర ఉందని కూడా సిట్ తేల్చింది. మరిన్ని భూముల్ని జగన్మోహన్ రెడ్డి అండతో కొట్టేయడానికే ధర్మాన తన నరంలేని నాలుకకు పనిచెప్పి, ఉత్తరాంధ్రవాసుల మనస్సుల్లో విషబీజాలు నాటుతున్నాడు. 

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో తిరుగుతున్న ధర్మాన, భవిష్యత్ లో తాను మరలా మంత్రిగా పనిచేయాలని, తన కొడుకుని ఎంపీని చేయాలని మూడు జిల్లాల్లోని వారితో మంతనాలు జరుపుతూ విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నాడు. 

విశాఖ నగరవాసులు వైసీపీని ఆదరించడంలేదు. గతంలో తన తల్లిని ఆ నగరప్రజలు ఓడించారన్న కక్షతోనే జగన్మోహన్ రెడ్డి వారిపై పెత్తనం చేయడానికి విజయసాయిరెడ్డిని, వై.వీ.సుబ్బారెడ్డిని అక్కడ నియమించాడు. వారిద్దరూ వైసీపీవారితో, ఉత్తరాంధ్ర మంత్రులతో కలిసి ఎంతవరకు వీలైతే అంతవరకు దోచిపెడితే తరువాత తీరుబడిగా జగన్మోహన్ రెడ్డి వెళ్లి అక్కడ తిష్టవేస్తాడు. 

ఉత్తరాంధ్రప్రజలు ధర్మాన ప్రసాదరావుని, బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారామ్ లను తమప్రాంతానికి ఏమైనా చేయమని అడిగారా? మూడు రాజధానులు కావాలని వారు మంత్రుల్ని, వైసీపీ వారిని అడిగారా? ఉత్తరాంధ్ర వాసులు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేరు. విశాఖవాసులు 2019 ఎన్నికల్లోనే తమకున్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ఆ క్రమంలోనే అక్కడ టీడీపీ వారిని గెలిపించారు" అని ఆనంద్ బాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News