Team India: టీమిండియా జైత్ర యాత్ర!... ఏడోసారి ఆసియా కప్‌ను గెలిచిన మహిళల జట్టు!
- ఆసియా కప్ ఫైనల్లో భారత మహిళల జట్టు విక్టరీ
- శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా
- ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన భారత జట్టు
- హాప్ సెంచరీతో అజేయంగా నిలిచిన స్మృతి
టీమిండియా జైత్ర యాత్ర అప్రతిహతంగా సాగుతోంది. అటు పురుషుల జట్టు అన్ని ఫార్మాట్లలో సత్తా చాటుతూ సాగుతుంటే... తామేమీ తక్కువ తినలేదన్నట్లు మహిళల జట్టు కూడా రెట్టించిన ఉత్సాహంతో వరుస విజయాలను నమోదు చేస్తోంది. ఈ జైత్ర యాత్రలో భాగంగా టీమిండియా మహిళల జట్టు శనివారం ఆసియా కప్ టైటిట్‌ను చేజిక్కించుకుంది. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక జట్టును చిత్తు చేసిన భారత మహిళల జట్టు ఆసియా కప్‌ను ఏడో సారి దేశానికి తీసుకు వచ్చింది.
ఆసియా కప్ ప్రారంభం నుంచే వరుస విజయాలు నమోదు చేస్తూ సాగిన భారత మహిళల జట్టు..రెండు రోజుల క్రితం జరిగిన సెమీస్‌లో విజయంతో టైటిల్ పోరుకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం శ్రీలంకతో జరిగిన ఫైనల్లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించిన మహిళల జట్టు విజేతగా నిలిచింది. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకోగా... భారత బౌలర్లు లంక బ్యాటర్లను క్రీజులో కుదురుకోనీయ లేదు. వరుసగా వికెట్లు తీస్తూ లంక బ్యాటింగ్‌ను 20 ఓవర్లలో కేవలం 69 పరుగులకే కట్టడి చేసింది.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా... కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని కేవలం 8.3 ఓవర్లలోనే ఛేదించింది. వెరసి లంకపై 8 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా ఇన్నింగ్స్‌ను ఓపెనర్ షెఫాలీ శర్మ (5)తో కలిసి ప్రారంభించిన స్మృతి మంథాన 25 బంతుల్లోనే 51 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. జెమీమా రోడ్రిగ్జ్ (2) ఆకట్టుకోకున్నా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (11 నాటౌట్)...మంథానకు తోడుగా నిలిచింది. ఈ విక్టరీతో ఆసియా కప్‌ను టీమిండియా ఇప్పటిదాకా 7 సార్లు గెలిచినట్టయింది.