Aadhaar: పుట్టుకతోనే ఆధార్​.. బర్త్​ సర్టిఫికెట్లతోనే ఇచ్చేందుకు ఏర్పాట్లు

Aadhaar For Newborns Along With Birth Certificates

  • ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు
  • త్వరలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలుకు కేంద్రం నిర్ణయం
  • ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్న విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ
  • తల్లిదండ్రుల ఆధార్, చిరునామాల ఆధారంగా శిశువులకు ఆధార్ జారీ

ఆధార్ సర్టిఫికెట్.. ఈ రోజు మన సాధారణ గుర్తింపు, బ్యాంకింగ్ అవసరాల నుంచి ప్రభుత్వ పథకాల దాకా దేనికైనా ఆధార్ కావాల్సిందే. దేశవ్యాప్తంగా ఆధార్ నమోదును విస్తృతంగా చేపట్టిన కేంద్ర ప్రభుత్వం అటు తర్వాత కొత్తగా సంస్కరణలూ తీసుకువచ్చింది. కొత్తగా జన్మించే శిశువులకు ఆధార్ నమోదు విషయంలో ఇబ్బందులు పడకుండా.. బర్త్ సర్టిఫికెట్లతోపాటే ఆధార్ నమోదు చేసేలా చర్యలు చేపట్టింది.

ఇప్పటికే 16 రాష్ట్రాల్లో అమలు..
పిల్లలకు బర్త్ సర్టిఫికెట్ తో పాటే ఆధార్ నమోదు చేసి ఇచ్చేందుకు ఏడాది కింద తొలుత పైలట్ ప్రాజెక్టును చేపట్టిన కేంద్ర ప్రభుత్వం.. తర్వాత వివిధ రాష్ట్రాలకు విస్తరించుకుంటూ వచ్చింది. ఇప్పటివరకు సుమారు 16 రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తుండగా.. త్వరలోనే మొత్తంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఏర్పాట్లు చేస్తోంది.

తల్లిదండ్రుల ఆధార్, శిశువు ఫొటోతో..
ప్రస్తుతం ఐదేళ్లలోపు వయసున్న పిల్లలకు ఆధార్ నమోదు కోసం ఎలాంటి బయోమెట్రిక్ తీసుకోవడం లేదు. తల్లిదండ్రుల ఆధార్ నంబర్లు, చిరునామాలు, పిల్లల ఫొటోను మాత్రమే తీసుకుంటున్నారు. శిశువులకు ఆధార్ విషయంలోనూ ఇదే విధానాన్ని అనుసరించనున్నారు. బర్త్ సర్టిఫికెట్ ఇచ్చే సమయంలోనే తల్లిదండ్రుల ఆధార్ తీసుకుని.. ఆ వివరాల ఆధారంగా చిన్నారులకు ఆధార్ జారీ చేయనున్నారు. పిల్లలు ఐదేళ్ల వయసుకు వచ్చాక బయోమెట్రిక్ నమోదు చేయించాల్సి ఉంటుంది. మళ్లీ 15 ఏళ్లు వచ్చాక బయోమెట్రిక్ వివరాలను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News