Sourav Ganguly: క్యాబ్ అధ్యక్షుడిగా మళ్లీ గంగూలీ.. అనూహ్యంగా రేసులోకి!
- బీసీసీఐ అధ్యక్షుడిగా మరోమారు కొనసాగాలని భావించిన గంగూలీ
- 2015-2019 మధ్య క్యాబ్ అధ్యక్షుడిగా పనిచేసిన ‘దాదా’
- ఈ నెల 22న క్యాబ్ అధ్యక్ష పదవికి నామినేషన్
బీసీసీఐ అధ్యక్షుడిగా మరోమారు కొనసాగాలని భావించి కుదరకపోవడంతో నిష్క్రమిస్తున్న సౌరవ్ గంగూలీ అనూహ్యంగా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) పగ్గాలు చేపట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఐపీఎల్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ తిరస్కరించిన గంగూలీ.. క్యాబ్ అధ్యక్ష బరిలో నిలుస్తున్నట్టు ప్రకటించాడు. బీసీసీఐ అధ్యక్షుడు కావడానికి ముందు 2015-2019 మధ్య క్యాబ్ అధ్యక్షుడిగా పనిచేసిన గంగూలీ మరోమారు ‘క్యాబ్’ అధ్యక్ష పీఠంపై కన్నేశాడు.
ఈ సందర్భంగా ‘దాదా’ మాట్లాడుతూ.. ‘‘అవును.. క్యాబ్ అధ్యక్ష బరిలో నిలుస్తున్నా’’ అని పేర్కొన్నాడు. ఈ నెల 22న నామినేషన్ వేయబోతున్నట్టు చెప్పాడు. ఐదేళ్లపాటు తాను క్యాబ్ అధ్యక్షుడిగా పనిచేశానని, లోధా నిబంధనల ప్రకారం మరో నాలుగేళ్లు అధ్యక్షుడిగా కొనసాగవచ్చని పేర్కొన్నాడు. ఈ నెల 20న తన ప్యానెల్ ఖరారు చేస్తానని, ఏం జరుగుతుందో చూద్దామని అన్నాడు. కాగా, గంగూలీ సోదరుడు స్నేహాశీష్ గంగూలీ క్యాబ్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావించాడు. అయితే, ఇప్పుడు గంగూలీ ప్రకటనతో అంచనాలన్నీ తారుమరయ్యాయి.