Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. దైవ దర్శనం చేసుకుని వస్తున్న 9 మంది యాత్రికుల దుర్మరణం

9 pilgrims dead after head on collision of tempo and milk van in Karnataka

  • హసాన్ జిల్లాలో ఘటన
  • టెంపోను ఢీకొట్టిన కర్ణాటక బస్సు.. టెంపో అదుపు తప్పి పాల వ్యాన్‌ను ఢీకొట్టిన వైనం
  • మృతుల్లో నలుగురు చిన్నారులు
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం బసవరాజు బొమ్మై

కర్ణాటకలోని హసాన్ జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. జిల్లాలోని అర్సికెరె తాలూకాలోని గాంధీనగర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యాత్రికులు టెంపోలో ధర్మస్థల సుబ్రహ్మణ్యస్వామి, హసనంబ ఆలయాలను దర్శించుకుని వస్తుండగా గాంధీనగర్ వద్ద కేఎంఎప్‌ పాల వ్యానును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా ముగ్గురు ప్రాణాలు విడిచారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. శివమొగ్గ వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు టెంపోను ఢీకొట్టడంతో అది అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మిల్క్ వ్యాన్‌ను ఢీకొట్టింది. టెంపో రెండు వైపుల నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తామన్నారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

  • Loading...

More Telugu News