Nirmala Sitharaman: రూపాయి విలువ పడిపోవడానికి కారణం ఇదే: నిర్మలా సీతారామన్
- భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతల వల్లే క్షీణత అన్న ఆర్థిక మంత్రి
- ఈడీ స్వతంత్రంగా తన పని తాను చూసుకుంటోందని వ్యాఖ్య
- అమెరికా పర్యటనలో ఉన్న నిర్మల
డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ పడిపోవడానికి భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు పెరగడమే కారణమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. దీన్ని ఎదుర్కోవటానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వాణిజ్య లోటు ప్రతిచోటా పెరుగుతోందని, దానిపై తాము దృష్టిసారించామన్నారు. ఇక, దేశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పూర్తి స్వతంత్రంగా పని చేస్తోందని ఆమె అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న నిర్మల వాషింగ్టన్ డీసీలో మీడియాతో మాట్లాడారు. రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం ఈడీని ఉపయోగిస్తుందా ?అన్న ప్రశ్నకు స్పందించారు.
ఈడీ పూర్తి స్వతంత్ర సంస్థ అని స్పష్టం చేశారు. ‘ఈడీ నేరాలను అంచనా వేసి ముందుకెళ్తుంది. పూర్తి స్వతంత్రంగా ఉంటుంది. పలు దర్యాప్తుల్లో గొప్పగా నిలిచిన సందర్భాలున్నాయి. అధికారుల చేతిలో తగిన ప్రాథమిక సాక్ష్యాలు దీనికి కారణం’ అని నిర్మల పేర్కొన్నారు. జీ20 దేశాలు, దాని ప్రాధాన్యతల గురించి కూడా నిర్మల మాట్లాడారు. ‘మేము చాలా మంది జీ20 సభ్యులతో ద్వైపాక్షిక చర్చలు జరిపాము. చాలా సవాళ్లు ఉన్న సమయంలో నాయకత్వ బాధ్యతలు తీసుకుంటున్నాం. పాశ్చాత్య దేశాలు విద్యుత్తు కోసం బొగ్గు వైపు వెళ్తున్నాయి. కేవలం భారత్ మాత్రమే కాదు, అనేక దేశాలు ఇంధన ఉత్పత్తి కోసం తిరిగి బొగ్గును ఆశ్రయించాల్సి వస్తోంది’ అని అభిప్రాయపడ్డారు.