mohammed siraj: ఆస్ట్రేలియాలో ల్యాండ్ అయిన హైదరాబాదీ ఎక్స్ ప్రెస్ సిరాజ్
- భారత జట్టుతో కలువనున్న యువ పేసర్
- వరల్డ్ కప్ టీమ్ స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపిక సిరాజ్
- ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లో సత్తా చాటిన హైదరాబాద్ ఆటగాడు
టీ20 ప్రపంచకప్‌కు ముందు రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టులో చేరేందుకు భారత ఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ బ్రిస్బేన్ చేరుకున్నాడు. వెన్నుగాయం కారణంగా స్టార్ పేసర్ బుమ్రా జట్టుకు దూరం కావడంతో అతని స్థానంలో స్టాండ్ బై జాబితాలోని మహ్మద్ షమీని తుది జట్టులోకి తీసుకున్నారు. మరో స్టాండ్ బై ప్లేయర్ దీపక్ చహర్ కూడా గాయపడ్డాడు. దాంతో, ఖాళీ అయిన స్టాండ్‌బై ఆటగాళ్ల జాబితాలో సిరాజ్, శార్దూల్ ఠాకూర్ లను చేర్చారు. ఈ క్రమంలో సిరాజ్ బ్రిస్బేన్ చేరుకున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు సైతం గెలుచుకున్నాడు. దాంతో, ప్రపంచ కప్ జట్టులో బుమ్రా స్థానాన్ని భర్తీ చేసేందుకు సిరాజ్ ఫేవరెట్‌గా కనిపించాడు. కానీ, అనుభవానికి మొగ్గు చూపిన సెలెక్టర్లు షమీకే ఓటేశారు. ఈ క్రమంలో స్టాండ్ బై జాబితాలో సిరాజ్ కు అవకాశం దక్కింది. కాగా, 16 జట్లు బరిలో నిలిచిన టీ20 ప్రపంచకప్ ఆదివారం మొదలవుతోంది. ఈ నెల 23న మెల్‌బోర్న్‌లో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్ తో భారత్ తన టీ20 ప్రపంచకప్ ప్రస్థానాన్ని మొదలు పెట్టనుంది. అంతకుముందు 17న ఆస్ట్రేలియాతో, 19న న్యూజిలాండ్ తో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడనుంది.