Team India: 11 ఏళ్ల చిన్నారి ప్రతిభకు రోహిత్ ఫిదా.. పిలిచి నెట్స్ లో అతని బౌలింగ్ లో ప్రాక్టీస్
- ప్రపంచ కప్ కోసం పెర్త్ లోని వాకా గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్న రోహిత్ సేన
- ఆ మైదానంలో చిన్నపిల్లలకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బౌలింగ్ చేసిన 11 ఏళ్ల దృషిల్
- ఈ కుర్రాడి ప్రతిభను మెచ్చి నెట్స్ లో అతని బౌలింగ్ లో బ్యాటింగ్ చేసిన రోహిత్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్. అలవోకగా సిక్సర్లు కొట్టే అతనికి బౌలింగ్ చేయాలంటే ఏ బౌలర్ అయినా భయపడతాడు. అలాంటి 11 ఏళ్ల కుర్రాడు రోహిత్ కు బౌలింగ్ చేశాడు. ఏ మాత్రం తడబాటు లేకుండా అతనికి బంతులు వేశాడు. తనకు ఈ అవకాశం ఇచ్చింది స్వయంగా రోహిత్ శర్మనే కావడం విశేషం. ఆ కుర్రాడి పేరు దృషిల్ చౌహాన్. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న భారత జట్టు పెర్త్ లోని వాకా స్టేడియంలో ప్రపంచ కప్ కోసం సన్నాహకాల్లో ఉంది. ఈ సందర్భంగా వాకా మైదానంలో చిన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రరమంలో దృషిల్ బౌలింగ్ చేయడం అందరినీ ఆకట్టుకుంది.
టెన్నిస్ బాల్ తో మంచి రనప్ తో బౌలింగ్ చేయడం రోహిత్ గుర్తించాడు. అతని సామర్థ్యాన్ని గ్రహించాడు. వెంటనే ఈ కుర్రాడిని పిలిపించుకొని నెట్స్ లో తనకు బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చాడు. రోహిత్ నుంచి పిలుపు రావడంతో దృషిల్ ఎగిరి గంతేశాడు. నెట్స్ లో టెన్నిస్ బాల్ తో రోహిత్ కు బౌలింగ్ చేశాడు. చిన్న పిల్లాడి ప్రతిభను గుర్తించడమే కాకుండా అతని బౌలింగ్ లో బ్యాటింగ్ చేసి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఈ వీడియోను బీసీసీఐ తన వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది.