Chandrababu: విశాఖ ఘటనల నేపథ్యంలో... పవన్ కల్యాణ్ కు మద్దతుగా చంద్రబాబు వ్యాఖ్యలు
- విశాఖలో వాడీవేడి రాజకీయ పరిణామాలు
- స్పందించిన చంద్రబాబు
- వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తున్నట్టు వెల్లడి
- ఒక పార్టీ అధినేత కారులోనే కూర్చోవాలా అంటూ ప్రశ్నించిన వైనం
నిన్న సాయంత్రం నుంచి విశాఖలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. విశాఖలో వైసీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వైసీపీ చేస్తున్న కుట్రలు దుర్మార్గం అని విమర్శించారు. పవన్ కల్యాణ్ బస చేస్తున్న హోటల్ లో సోదాలు నిర్వహించడం, నాయకులను బెదిరించడం నియంత పాలనకు నిదర్శనం అని పేర్కొన్నారు.
ఒక పార్టీ అధినేత కారులో కూర్చోవాలా? బయటకు వచ్చి అభివాదం చేయాలన్నది కూడా పోలీసులే నిర్ణయిస్తారా? అంటూ ప్రశ్నించారు.
విశాఖ ఎయిర్ పోర్టు ఘటన పేరుతో పదుల సంఖ్యలో అక్రమంగా అరెస్ట్ చేసిన జనసేన నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని తెలిపారు. ర్యాలీకి అనుమతి అడిగిన నేతలపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చంద్రబాబు వివరించారు.