Ayyanna Patrudu: విచ్చలవిడిగా అధికారం దుర్వినియోగం చేసి జరిపిన కబ్జాకోరుల గర్జన అట్టర్ ఫ్లాప్ అయ్యింది: అయ్యన్నపాత్రుడు
- విశాఖలో నిన్న వైసీపీ గర్జన
- కబ్జాకోరుల గారడీ అంటూ అయ్యన్న విమర్శలు
- జగన్ కల్పించిన మూడు ముక్కలాట అని వ్యాఖ్యలు
- ధర్మం ముందు అధర్మం ఓడిపోక తప్పదని వెల్లడి
విశాఖలో నిన్న వైసీపీ నిర్వహించిన గర్జన కార్యక్రమంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శనాస్త్రాలు సంధించారు. అది గర్జన కాదు... కబ్జాకోరుల గారడీ అని పేర్కొన్నారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి గర్జన కార్యక్రమం జరిపినప్పటికీ, అది అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు.
అధర్మానికి 18 అక్షౌహిణుల బలగాలున్నా, 6 అక్షౌహిణులే వున్న ధర్మం ముందు ఓడిపోక తప్పలేదని తెలిపారు. వారి కుట్రలపై వరుణ దేవుడు కూడా నీళ్లు చల్లాడని వెల్లడించారు. మూడు ముక్కలాట ఉత్తరాంధ్ర మనస్సులో నుండి వచ్చింది కాదని, తమ దోపిడీ, దౌర్జన్యాలు, పన్నుల పీకుడు నుండి ప్రజల దృష్టి మళ్ళించేందుకు జగన్ రెడ్డి కల్పించిన కుట్ర మూడు ముక్కలాట అని వివరించారు.
"రోల్డ్ గోల్డ్ ను మోసపూరిత ప్రచారాలతో గోల్డ్ గాను, గోల్డ్‌ను రోల్డ్ గోల్డ్ గాను ఒకసారి మాయచేసి నమ్మించగలిగారు. ఒకసారి రుచి మరిగిన రోల్డ్ గోల్డ్ దొంగ మరోసారి మోసం చేయడానికి వచ్చి బంగారం పోగొట్టుకొన్న వారి చేతుల్లో తగిన శాస్తి జరిపించుకున్న చందంగా గర్జన విఫలమైంది.
మూడేళ్లలో విశాఖ అభివృద్ధికి జగన్‌రెడ్డి చేసింది ఏమీలేదు. పైగా కబ్జాలు, విధ్వంసాల పాలు చేశారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో విశాఖపై మొసలి కన్నీరు కారిస్తే మరోసారి మోసపోవడానికి ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులేమీ కాదు అని గర్జన ఫ్లాప్ షో ద్వారా నిరూపితమైంది. కపట నాటకాలు, కృత్రిమ ఉద్యమాలు, బలవంతపు జనసమీకరణలు జగన్‌రెడ్డి ముఠా దోపిడీపై వచ్చే ప్రజా సునామీని ఆపలేవు.
నిన్నటి కబ్జాకోరుల గర్జనకు విజయసాయిరెడ్డి ఎందుకు ముఖం చాటేశారు? మూడుముక్కల ఏర్పాటు అధికారం జగన్‌రెడ్డికి లేదని హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ విషయం తెలిసీ మూడు ముక్కలాట ఆడుతున్నారు. ప్రాంతీయ, కుల విద్వేషాలు రగిల్చి, ప్రజల దృష్టి మళ్ళించి ఉత్తరాంధ్రను దోచుకోవడానికే ఇదంతా" అంటూ అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు.