Somu Veerraju: జనసైనికులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి... లేకపోతే జనసేనతో కలిసి ప్రతిఘటించేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది: సోము వీర్రాజు
- విశాఖలో పవన్ కల్యాణ్ పర్యటన
- ఉద్రిక్త పరిస్థితులతో వేడెక్కిన విశాఖ నగరం
- జనసేన నేతలు, కార్యకర్తల అరెస్ట్
- వెంటనే విడుదల చేయాలన్న సోము వీర్రాజు
పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన నేపథ్యంలో, జనసేన నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. పితాని సత్యనారాయణ, పంతం నానాజీ తదితర అగ్రనేతలతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో, బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. జనసేన నాయకులు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెట్టడాన్ని ఏపీ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.
ఈ కేసులను తక్షణమే ఎత్తివేయాలని, జనసేన నేతలు, కార్యకర్తలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ వైఖరి మార్చుకోకుంటే జనసేనతో కలిసి ప్రతిఘటించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
అటు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా పవన్ కల్యాణ్ కు మద్దతు పలికారు. పవన్ కల్యాణ్ పట్ల పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఖండిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే కార్యక్రమాలను మానుకోవాలని స్పష్టం చేశారు.