Botsa Satyanarayana: జనసేన ఒక సెలబ్రిటీకి చెందిన సంస్థ కాబట్టి చిల్లరగాళ్లు ఉంటారు: ఏపీ మంత్రి బొత్స

Botsa slams Pawan Kalyan

  • పవన్, ఏపీ మంత్రుల మధ్య మాటల యుద్ధం
  • ఘాటు వ్యాఖ్యలు చేసిన బొత్స
  • విశాఖ రాజధాని పట్ల నీకేంటి అభ్యంతరమని వ్యాఖ్యలు
  • మంచికి మద్దతు ఇవ్వాలని హితవు
  • చంద్రబాబుపైనా విమర్శలు

జనసేనాని పవన్ కల్యాణ్, ఏపీ మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పవన్ విశాఖలో అడుగుపెట్టినప్పటి నుంచి చోటుచేసుకున్న పరిణామాలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేస్తే నీకొచ్చే నష్టం ఏంటి? అని పవన్ ను సూటిగా ప్రశ్నించారు. 

గాజువాక నుంచి పోటీ చేసిన నువ్వు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పావు... ఇప్పుడు టీడీపీకి వత్తాసు పలుకుతూ బురదచల్లే కార్యక్రమం చేస్తున్నావు అంటూ బొత్స మండిపడ్డారు. నీకు గానీ, నీ పార్టీకి గానీ సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా? అని నిలదీశారు. 

"మంచికి మద్దతు ఇవ్వాలి, తప్పయితే తప్పు అని చెప్పాలి. ఇది బాధ్యత కలిగిన నాయకుడి లక్షణం. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఇలాంటి వ్యక్తిత్వమే ఉండాలి. పవన్ కు ఇలాంటివి ఏవీలేవు" అంటూ బొత్స విమర్శలు చేశారు. 

ఒక దశ దిశ లేని పార్టీ జనసేన అని, అది రాజకీయ పార్టీ కాదని, ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలేవీ లేవని వ్యాఖ్యానించారు. అది కేవలం ఒక సెలెబ్రిటీకి చెందిన సంస్థ అని, అందుకే చిల్లరగాళ్లు ఉంటారని పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి బొత్స టీడీపీ అధినేత చంద్రబాబుపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. విశాఖ ఎయిర్ పోర్టులో నిన్న మంత్రులపై జరిగిన దాడిని ఖండించకుండా, దాడికి పాల్పడినవారిని అరెస్ట్ చేయడం తప్పంటున్నారని మండిపడ్డారు. నీపై దాడి జరిగితే నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేస్తుంటావు, మరి మంత్రులు కూడా నీలాంటివాళ్లే కదా అంటూ ప్రశ్నించారు. 

ఇక, నిన్నటి దాడి ఘటనలో పోలీసుల వైఫల్యం కూడా ఉందని, వారి నిర్లక్ష్యం వల్లే దాడి జరిగిందని భావిస్తున్నామని బొత్స తెలిపారు.

  • Loading...

More Telugu News