Manchu Vishnu: 'జిన్నా' కోసం మోహన్ బాబు అన్ని అస్త్రాలు వాడేశారు: కోన వెంకట్
- హైదరాబాదులో జరిగిన 'జిన్నా' ప్రీ రిలీజ్ ఈవెంట్
- ఈ సినిమాకి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్న కోన వెంకట్
- విష్ణు కామెడీ టైమింగ్ పై కోన ప్రశంసలు
- ఈ నెల 21వ తేదీన థియేటర్లకు వస్తున్న సినిమా
మంచు విష్ణు హీరోగా రూపొందిన 'జిన్నా' ఈ నెల 21వ తేదీన థియేటర్లలో దిగిపోనుంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో, ఈ సినిమాకి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేసిన కోన వెంకట్ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో ఒక 'గోలీ సోడా' ఉంది .. ఒక 'జారు మిఠాయి' ఉంది. 'గోలీ సోడా' పాయల్ అయితే, జారు మిఠాయి సన్నీలియోన్. ఆ ఇద్దరూ కూడా ఈ రోజున ఇక్కడికి రాలేకపోయారు.
నా వరకూ ఈ సినిమా నాపై మోహన్ బాబు గారు పెట్టిన బాధ్యతగా భావిస్తున్నాను. ప్రతి యాక్టర్ కి లైఫ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుంది .. అలా విష్ణుకి 'జిన్నా' గొప్ప సెకండ్ ఇన్నింగ్స్ అనే చెప్పుకోవాలి. అందుకు అవసరమైన అన్ని అస్త్రాలను ఈ సినిమా కోసం మోహన్ బాబు వాడేశారు. మా చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రమే విష్ణు. ఆయన కామెడీ టైమింగ్ ఏమిటనేది నాకు తెలుసు. ఎందుకంటే ఆయనతో కలిసి నేను పనిచేశాను.
ఈ సినిమా కోసం మా అందరినీ కలిపి నడిపించిన గొప్ప శక్తి మోహన్ బాబుగారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ నేను 'జిన్నా'కి పని చేశాను అని గర్వంగా జీవితాంతం చెప్పుకుంటారు. విష్ణు గొప్ప కొడుకు మాత్రమే కాదు .. ఒక మంచి తండ్రి కూడా. అలాంటి గొప్ప లక్షణాలు ఉన్న విష్ణుకి ఈ సినిమా విజయం చాలా అవసరం. అలాంటి విజయాన్ని మీరంతా అందిస్తారని ఆశిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.