Kishan Reddy: ఏపీకి అమరావతే రాజధాని అని ప్రధాని మోదీ చెప్పారు: కిషన్ రెడ్డి
- అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉందన్న కిషన్ రెడ్డి
- రాజకీయాల్లో కక్షసాధింపులు ఉండకూడదని హితవు
- ఏలూరు, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్న కేంద్ర మంత్రి
మూడు రాజధానులను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని వైసీపీ ప్రభుత్వం చెపుతున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులకు మద్దతుగా వైజాగ్ లో విశాఖ గర్జన పేరుతో భారీ ర్యాలీని, సభను కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని మరోసారి స్పష్టం చేశారు. అమరావతే రాజధాని అని ప్రధాని మోదీ చెప్పారని తెలిపారు. అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏది చేసినా రాజధాని మారే ప్రసక్తే లేదని తెలిపారు.
రాజకీయాల్లో కక్షసాధింపు చర్యలు ఉండకూడదని కిషన్ రెడ్డి హితవు పలికారు. జనసేనాని పవన్ కల్యాణ్ వైజాగ్ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై కిషన్ రెడ్డి స్పందిస్తూ.. ఇతర రాజకీయ పార్టీ కార్యక్రమం చేస్తున్నప్పుడు... రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదని అన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని చెప్పారు. పార్టీ కార్యక్రమాలను నిర్వహించుకునే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుందని అన్నారు.
ఈ ఉదయం కిషన్ రెడ్డి విజయవాడకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇతర నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. ఏలూరు, గుంటూరు జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు.