Shankar Nayak: తమ పిల్లలకు అద్దెగర్భాన్ని ఇచ్చిన మహిళ ఎవరో తెలిపిన నయనతార దంపతులు
- పెళ్లైన నాలుగు నెలలకే తల్లిదండ్రులైన నయనతార దంపతులు
- సరోగసీ ద్వారా తల్లిదండ్రులైన నయన్ దంపతులు
- యూఏఈలోని బంధువు గర్బం ద్వారా పిల్లలను కన్నట్టు సమాచారం
ప్రముఖ సినీ నటి నయనతార, ఆమె భర్త విఘ్నేశ్ శివన్ లు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. పెళ్లయిన నాలుగు నెలలకే వారు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. సరోగసీ విధానం ద్వారా మరో మహిళ గర్భం ద్వారా పిల్లలను కన్నారు. ఇది సంచలనంగా మారింది. సరోగసీ ద్వారా పిల్లలను కనడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పును వెలువరించింది. విధిలేని పరిస్థితుల్లో, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అది కూడా ప్రభుత్వ అనుమతితో మాత్రమే సరోగసీ ద్వారా పిల్లలను కనొచ్చు. దీంతో, వీరు వివాదంలో చిక్కుకున్నారు. సరోగసీ ద్వారా పిల్లలను కన్నట్టయితే వీరికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
మరోవైపు, నయన్ దంపతుల సరోగసీపై తమిళనాడు ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో తమిళనాడు వైద్య, ఆరోగ్యశాఖకు ఇచ్చిన అఫిడవిట్ లో నయనతార దంపతులు కీలక విషయాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇండియాలో సరోగసీ ద్వారా తాము పిల్లలను కనలేదని... యూఏఈలో ఉన్న తమ బంధువైన మహిళ గర్భం ద్వారా పిల్లలను కన్నామని చెప్పినట్టు సమాచారం. నయనతార జంట ఈ ఏడాది జూన్ 9న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.