Dilip Mahalanabis: ‘ఓఆర్ఎస్ ద్రావకం‘ పితామహుడు దిలీప్ మహాలనబిస్ కన్నుమూత
- ఆరోగ్య సమస్యల కారణంగా కోల్ కతాలో మృతి
- ఓరల్ రీహైడ్రేషన్ ద్రావకం తయారీలో ముఖ్య పాత్ర
- బంగ్లాదేశ్ స్వాతంత్య్ర సమయంలో దీనికి ప్రాచుర్యం
- ఓఆర్ఎస్ వల్ల కలరా బాధితుల్లో తగ్గిన మరణాల రేటు
ఓఆర్ఎస్ డాక్టర్ గా పేరొందిన ప్రముఖ వైద్య నిపుణుడు దిలీప్ మహాలనబిస్ (88) కన్ను మూశారు. పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన్ను కోల్ కతాలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చేర్చగా ఆదివారం మరణించారు.
దిలీప్ చిన్న పిల్లల వైద్య నిపుణుడు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (కోల్ కతా) లో రీసెర్చ్ స్కాలర్ గా, 1966లో ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ (ఓఆర్టీ) ప్రాజెక్టుపై పనిచేశారు. డాక్టర్ డేవిడ్ ఆర్నలిన్, డాక్టర్ రిచర్డ్ ఏ క్యాష్ తో కలసి పరిశోధనలో పాల్గొన్నారు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్ ద్రావకం)ను వీరు అభివృద్ధి చేశారు.
‘‘ఓఆర్ఎస్ గొప్ప ఆవిష్కరణ.ఈ ఫార్ములేషన్ తయారీ, ఓఆర్టీకి ప్రాచుర్యం కల్పించడంలో మహాలనబిస్ చేసిన సేవలు అపారమైనవి. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ సమయంలో కలరా మహమ్మారి కారణంగా మరణాలను తగ్గించడంలో ఓఆర్ఎస్ ఎంతో సాయపడింది’’ అని ఐసీఎంఆర్ - నిసెడ్ డైరెక్టర్ శాంతా దత్తా పేర్కొన్నారు.
అంతకు ముందే ఓఆర్ఎస్ ను అభివృద్ది చేసినప్పటికీ.. బంగ్లాదేశ్ యుద్ధ సమయంలోనే దానికి ప్రాచుర్యం లభించింది. లక్షలాది మంది శరణార్థులు భారత్ లోని సరిహద్దు జిల్లాల్లోకి వలస రావడం చోటు చేసుకుంది. బోంగాన్ శరణార్థి శిబిరంలో కలరా పెద్ద ఎత్తున విజృంభించడంతో అక్కడి బాధితులకు ఓఆర్ఎస్ ను దిలీప్ మహాలనబిస్ అందించారు. దీంతో మరణాల రేటు 30 శాతం నుంచి 3 శాతానికి పడిపోయింది. ఆ తర్వాత నుంచి ఓఆర్ఎస్ కు ప్రపంచవ్యాప్తంగా ఆమోదనీయం పెరిగింది. 20వ శతాబ్దపు గొప్ప ఆవిష్కరణగా పేరొందింది. ఆయనకు ఎన్నో ప్రఖ్యాత సంస్థల నుంచి అవార్డులు లభించాయి.