sbi: ఎస్బీఐ సేవింగ్స్ డిపాజిట్లపై రేట్ల పెంపు
- రూ.10 కోట్ల లోపు డిపాజిట్లపై 2.70 శాతం వడ్డీ రేటు
- గతంతో పోలిస్తే తగ్గిన రేటు
- రూ.10 కోట్లకు మించితే 3 శాతం రేటు
చాలా కాలం తర్వాత సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగే సమయం వచ్చింది. ఆర్బీఐ వరుసగా రెపో రేటును పెంచుతూ వెళుతుండడం బ్యాంకుల్లో డిపాజిట్లు, రుణాలపై వడ్డీ రేట్ల పెరుగుదలకు దారితీస్తోంది. మే చివరి నుంచి రెపో రేటును 1.9 శాతం మేర పెంచింది. ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే నిధులపై వసూలు చేసే రేటును రెపో రేటుగా చెబుతారు.
ఈ పరిణామాలతో ఇప్పటికే ఎస్బీఐ సహా పలు ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులు డిపాజిట్లపై ఒక శాతం వరకు రేట్లను పెంచేశాయి. తాజాగా సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపైనా ఎస్బీఐ రేట్లను సవరించింది. వాస్తవానికి పెంచినట్టు అనిపిస్తున్నా.. ఎక్కువ మంది కస్టమర్లు దీని ప్రయోజనం సున్నాగానే ఉండనుంది. సేవింగ్స్ ఖాతాల్లో బ్యాలన్స్ రూ.10 కోట్ల కంటే తక్కువ ఉంటే వార్షిక వడ్డీ రేటును 2.70 శాతం ఇస్తుంది. ప్రస్తుతం దీనిపై 2.75 శాతం రేటు అమల్లో ఉంది. అంటే 0.05 శాతం నష్టపోయినట్టు. రూ.10 కోట్లకు మించితే 3 శాతం వడ్డీ రేటును ఇవ్వనుంది. నిజానికి ప్రస్తుతం ఈ కాలవ్యవధి డిపాజిట్లపై రేటు 2.75 శాతంగా ఉండడం గమనించాలి.