South Korea: ఉత్తర–దక్షిణ కొరియాల మధ్య యుద్ధ వాతావరణం
- సరిహద్దుల్లో ఇరు దేశాల సైనిక కార్యకలాపాలతో పరిస్థితి ఉద్రిక్తం
- ఉత్తర కొరియా అణు, క్షిపణి దాడి బెదిరింపుల నేపథ్యంలో సైనిక డ్రిల్స్ చేస్తున్న దక్షిణ కొరియా
- ఆగ్రహం వ్యక్తం చేసిన ఉత్తర కొరియా
నిప్పు–ఉప్పులా ఉండే శత్రు దేశాలు ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరుపక్షాల సైనిక కార్యకలాపాలు రెండు దేశాల మధ్య వాతావరణాన్ని వేడెక్కించాయి. ఉత్తర కొరియా అణ్వాయుధాలు, క్షిపణులను పరీక్షించాలని చూస్తుండగా.. దానికి దక్షిణ కొరియా దీటుగా స్పందించేందుకు సంసిద్ధం అవుతోంది. తమ ఆయుధ సామర్థ్యాన్ని పరీక్షించుకుంటోంది. ఈ క్రమంలో తమ వార్షిక హోగుక్ మిలటరీ డ్రిల్ ను దక్షిణ కొరియా దళాలు సోమవారం ప్రారంభించాయి. అమెరికా, జపాన్ ఉమ్మడి మిలటరీ డ్రిల్స్ ఈ శనివారం ముగియనున్నాయి.
మరోవైపు ఉత్తర కొరియా ఈ ఏడాది వేగంగా ఆయుధ పరీక్షలను నిర్వహిస్తోంది. శుక్రవారం భారీ ఆయుధాలతో కూడిన అంతర్-కొరియా సరిహద్దు సమీపంలో స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. దాంతో, దక్షిణ కొరియా సైతం ఆయుధ పరీక్షలకు దిగింది. అమెరికాతో కలిసి దాయాది దేశం ఉమ్మడి సైనిక కార్యకలాపాలపై ఉత్తర కొరియా కోపంగా ప్రతిస్పందించింది. ఇది తమను రెచ్చగొట్టడం, ప్రతిఘటనలను పురిగొల్పడం అని పేర్కొంది. దక్షిణ కొరియా ప్రభుత్వం మాత్రం ఇది తాము సాధారణంగా నిర్వహించే రక్షణ కార్యక్రమాలు అని చెబుతోంది.
గత వారం, ఉత్తర కొరియా క్షిపణిని ప్రయోగించడం, దాదాపు 500 రౌండ్ల ఫిరంగులను కాల్చడంతో పాటు సముద్ర సరిహద్దు సమీపంలో అనేక యుద్ధ విమానాలను ఎగురవేయడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ చర్యను దక్షిణ కొరియా ఖండించింది. సరిహద్దు ప్రాంతంలో శత్రు చర్యలను నిషేధించే 2018 ద్వైపాక్షిక సైనిక ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఈ కదలికలను అభివర్ణించింది. మరోవైపు ఉత్తర కొరియా 2017 తర్వాత మొదటి అణు పరీక్ష కోసం సన్నాహాలు పూర్తి చేసిందని దక్షిణ కొరియా చట్టసభ సభ్యులు ఆరోపిస్తున్నారు.