Covid: కరోనా టీకాల కొనుగోళ్లను నిలిపివేసిన కేంద్రం
- బడ్జెట్ లో 85 % నిధులు ఆర్థిక శాఖకు వాపస్
- వచ్చే ఆరు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రకటన
- మార్కెట్లో కూడా దొరుకుతున్నాయని వెల్లడి
కరోనా నియంత్రణ కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఫార్మా కంపెనీల నుంచి కేంద్ర ప్రభుత్వం టీకాలను కొనుగోలు చేసి, ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. తాజాగా కరోనా వ్యాక్సిన్ల కొనుగోలును కొంతకాలం ఆపేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కరోనా వ్యాక్సిన్లు పెద్ద మొత్తంలో నిల్వ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సుమారు 1.8 కోట్ల వ్యాక్సిన్ డోసులు ప్రస్తుతం నిల్వ ఉన్నాయని కేంద్రం తెలిపింది.
ఇప్పుడు నిల్వ ఉన్న డోసులు మరో ఆరు నెలల వరకు సరిపోతాయని, ఆ తర్వాత పరిస్థితిని బట్టి వ్యాక్సిన్ల కొనుగోలుపై నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వివరించింది. బయట మార్కెట్లోనూ కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. వ్యాక్సిన్ల కొనుగోలు కోసం ఈ ఏడాది వైద్యశాఖకు కేటాయించిన రూ. 5 వేల కోట్లలో 4,237.14 కోట్లను తిరిగి తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈమేరకు వైద్యశాఖ నుంచి ఆర్థిక శాఖకు నిధుల బదిలీ కూడా పూర్తయినట్లు సమాచారం.