YSRCP: వివేకా హత్య కేసు సాక్షులను రక్షించుకోవాలంటే గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాల్సిందే: సీబీఐ
- వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న గంగిరెడ్డి
- గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్
- గంగిరెడ్డి బయట ఉంటే సాక్షుల ప్రాణాలకు ముప్పేనని వివరణ
- స్థానిక పోలీసులు, నిందితులు కలిసి కేసు ముందుకు సాగకుండా అడ్డుకున్నారని ఆరోపణ
వైసీపీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును సీబీఐ కోరింది. ఈ మేరకు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది తన వాదనలను వినిపించారు. ఎర్ర గంగిరెడ్డి బయట ఉంటే ఈ కేసులోని సాక్షుల ప్రాణాలకు ముప్పేనని న్యాయవాది కోర్టుకు తెలిపారు. సాక్షుల ప్రాణాలను రక్షించుకోవాలంటే గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాల్సిందేనని ఆయన వాదించారు.
ఈ సందర్భంగా కేసు నిందితులతో పాటు స్థానిక పోలీసులపైనా సీబీఐ న్యాయవాది సంచలన ఆరోపణలు చేశారు. నిందితులు, స్థానిక పోలీసులు కుమ్మక్కయ్యారని, మూకుమ్మడిగా కేసు విచారణ ముందుకు జరగకుండా అడ్డుకున్నారని తెలిపారు. సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు గంగిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. సీబీఐ వాదనలపై 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది.