UK: బ్రిటన్ ప్రధాన మంత్రా, క్యాబేజీయా.. ఎవరి పని ముందు ఖతమవుతుంది?.. యూట్యూబ్‌ లో లైవ్‌ స్ట్రీమింగ్‌

UK prime minister or lettuce which one lasts longer

  • బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఓ వార్తా సంస్థ విమర్శనాత్మక కార్యక్రమం
  • బ్రిటన్ పరిస్థితిని పట్టిచూపుతోందంటూ నెటిజన్ల కామెంట్లు
  • పోస్టును షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ‘గ్రేట్ (బ్రూటల్) బ్రిటన్’ అంటూ కామెంట్

బ్రిటన్ లో కొంతకాలం నుంచి తీవ్రమైన రాజకీయ, ఆర్థిక సంక్షోభాలు పట్టిపీడిస్తున్నాయి. గత నాలుగేళ్లలోనే ఏకంగా ముగ్గురు ప్రధాన మంత్రులు మారిపోయారు. మూడేళ్ల కిందట థెరెసా మే పదవిని వదులుకోవడంతో బోరిస్ జాన్సన్ పీఠం ఎక్కారు. ఆయన రాజీనామా చేయడంతో నెలన్నర కిందట లిజ్ ట్రస్ ప్రధాని అయ్యారు. ఇదంతా కూడా ఒకే పార్టీ ప్రభుత్వంలో కావడం గమనార్హం. ప్రస్తుతం లిజ్ ట్రస్ విధానాలపైనా తీవ్ర విమర్శలు వస్తుండటం, కన్జర్వేటివ్ పార్టీ ఆమెను కూడా ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని కోరవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బ్రిటన్ కు చెందిన ‘డైలీ స్టార్’ వార్తా సంస్థ పెట్టిన లైవ్ వీడియో కలకలం రేపుతోంది.

ఫొటోను, క్యాబేజీని పెట్టి..
ఓ టేబుల్ పై బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ ఫొటో, దాని పక్కన ఓ క్యాబేజీని పెట్టారు. క్యాబేజీకి కళ్లను కూడా అతికించారు. దీనికి ఓ కెమెరాను పెట్టి.. యూట్యూబ్ లో లైవ్ మొదలుపెట్టారు. దీనికి ‘లెట్యూస్ (క్యాబేజీలో ఓ రకం) కన్నా లిజ్ ట్రస్ ఎక్కువకాలం నిలవగలరా’ అని ప్రశ్నను ఈ వీడియోకు క్యాప్షన్ గా పెట్టింది. ఓ రకంగా చెప్పాలంటే క్యాబేజీ మహా అయితే కొన్ని రోజుల్లో పాడైపోతుంది. అప్పటిదాకా కూడా లిజ్ ట్రస్ ప్రధానిగా కొనసాగగలరా? అని ఎద్దేవా చేస్తూ పెట్టిన వీడియో ఇది అన్నమాట.
  • బ్రియాన్ క్లాస్ పేరిట ఉన్న ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ తో పోస్టు చేశారు. ‘‘బ్రిటీష్ న్యూస్ పేపర్ యూట్యూబ్ లో ఈ లైవ్ స్ట్రీమ్ పెట్టింది. ఏమైనా బ్రిటీషర్ల హాస్య చతురత భలేగా ఉంటుంది” అని కామెంట్ పెట్టారు.
  • ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దీనిని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘గ్రేట్ (బ్రూటల్) బ్రిటన్’ అని క్యాప్షన్ పెట్టారు. గ్రేట్ బ్రిటన్ పేరును ప్రస్తావిస్తూ మధ్యలో బ్రూటల్ (ఘోరమైన) అనే పదాన్ని బ్రాకెట్లో పెట్టారు. ఈ పోస్టుకు 12 వేల వరకు లైకులు వచ్చాయి.
  • ఇటీవల బ్రిటిష్ ప్రధాని మారినప్పుడు భారత సంతతికి చెందిన రిషి సునక్ కూడా పోటీ పడ్డారు. కానీ లిజ్ ట్రస్ పలు వాగ్దానాలు చేసి విజయం సాధించారు. దీనిని గుర్తుచేస్తూ విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి.
  • ‘‘బ్రిటీషర్లు తెల్లవారి అబద్ధాలనే నమ్ముతారు. లిజ్ ట్రస్ చెప్పిన అబద్ధాలు విని.. రిషి సునక్ కు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు వారికి తెలిసొచ్చింది’’ అంటూ పెద్ద సంఖ్యలో కామెంట్లు వస్తున్నాయి. అదే సమయంలో బ్రిటిషర్ల హాస్య చతురతకూ ప్రశంసలు దక్కుతున్నాయి.
  • ‘‘మన దేశంలో ఎవరిగురించి అయినా ఇలా కామెంట్లు పెట్టగలమా? ఏమైనా బ్రిటీషర్లకు స్వేచ్చ ఇంకా ఉంది..” అని కొందరు అంటున్నారు. ‘‘పాపం లిజ్ ట్రస్..” అని ఇంకొందరు, ‘‘క్యాబేజీకి పెట్టిన కళ్లు భలే బాగున్నాయి” అని మరికొందరు సరదా కామెంట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News