Corona Virus: బీఎఫ్-7 రూపంలో మళ్లీ విస్తరిస్తున్న కరోనా మహమ్మారి
- కథ ముగిసింది అనుకుంటున్న సమయంలో మళ్లీ ఉనికిని చాటుకుంటున్న కరోనా
- తొలుత చైనాలో వెలుగులోకి వచ్చిన బీఎఫ్-7 వేరియంట్
- ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించిన సబ్ వేరియంట్
కరోనా మహమ్మారి కథ ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో దానికి సంబంధించిన ఒక వార్త కలవరపాటుకు గురి చేస్తోంది. కరోనా వైరస్ కొత్త రూపాన్ని సంతరించుకుని మళ్లీ ఉనికిని చాటుకుంటోందనేదే ఆ వార్త. బీఎఫ్-7 అనే కరోనా సబ్ వేరియంట్ ను మన దేశంలో గుర్తించారు. గుజరాత్ బయోటెక్నాలజీ రీసర్చ్ సెంటర్ ఈ వేరియంట్ ను గుర్తించింది. ఈ వేరియంట్ తొలుత చైనాలో వెలుగు చూసింది. ఆ తర్వాత చాలా వేగంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, బెల్జియం దేశాలకు వ్యాపించింది. ఈ వేరియంట్ కు ఒకరి నుంచి మరొకరికి అత్యంత వేగంగా వ్యాపించే లక్షణం ఉంది.
ఈ వేరియంట్ కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది. దీని వ్యాప్తిని నిరోధించాల్సిన అవసరం ఉందని చెప్పింది. తగిన జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే అది డామినెంట్ వేరియంట్ గా మారుతుందని చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక కూడా హెచ్చరించింది. మరోవైపు బీఏ 5.1.7 అనే సబ్ వేరియంట్ ను కూడా చైనాలో గుర్తించారు.