Breast Cancer: రొమ్ము కేన్సర్ రాకుండా ఉండాలంటే ఇవి చేస్తే సరి!

Breast Cancer Prevention 6 Ways to Lower Your Risks

  • మహిళల్లో పెద్ద ఎత్తున పెరుగుతున్న ముప్పు
  • 30 ఏళ్లలోపే పిల్లలను కనడం ముఖ్యం
  • పిల్లలకు తల్లిపాలు పట్టడం ద్వారా రక్షణ
  • రోజువారీ వ్యాయామం.. అధిక బరువు తగ్గించుకోవాలి

మహిళల్లో రొమ్ము కేన్సర్ (బ్రెస్ట్ కేన్సర్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన దశాబ్ద కాలంలో ఇది సాధారణంగా మారిపోయింది. చిన్న వయసులోనే దీని బారిన పడుతున్నారు. దీంతో బ్రెస్ట్ కేన్సర్ ఎందుకు వస్తోంది? కారణాలు ఏంటి? నివారణ ఏంటి? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దీనికి ఫలానా కారణం అని ఇతమిద్ధంగా చెప్పలేమని నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ శుభమ్ గార్గ్ అన్నారు. 

‘‘పొగాకు ఉత్పత్తులను నమలడం వల్ల హెడ్, నెక్ కేన్సర్ వస్తుందని తెలుసు. పొగ తాగితే లంగ్ కేన్సర్ వస్తుందని చెప్పొచ్చు. కానీ బ్రెస్ట్ కేన్సర్ కు సూటిగా ఒకే కారణం లేదు’’ అని డాక్టర్ గార్గ్ పేర్కొన్నారు. కాకపోతే బ్రెస్ట్ కేన్సర్ రిస్క్ తగ్గించుకునేందుకు ఈ అంశాలను అనుసరించడం మంచిదని సూచించారు. 

స్థూలకాయం
బ్రెస్ట్ కేన్సర్ కేసులను వైద్యులు పరిశీలించినప్పుడు ఎక్కువగా స్థూలకాయులకు ఇది వస్తోంది. కనుక ఈ కోణంలో బరువు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. తీసుకునే ఆహార పరిమాణం పరిమితంగా ఉండాలి.

సమతులాహారం
ఆహారం అంటే ఏదో ఆకలి, రుచి తీర్చుకోవడం కాదు. అన్ని పోషకాలు ఉండే సమతులాహారం అవసరం. ముఖ్యంగా ప్రొటీన్లు, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ సమానంగా అందేలా చూసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక ఉప్పుతో కూడిన, చక్కెరలతో కూడిన పదార్థాలకు దూరంగా ఉండాలి. రోజువారీ ఆహారంలో పండ్లు భాగం కావాలి.

చురుకైన జీవనం
రోజువారీ తగినంత శారీరక వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. కనీసం 30 నిమిషాల పాటు కసరత్తులు చేయాలి. జిమ్ కు వెళ్లొచ్చు. లేదంటే వాకింగ్ చేసినా సరిపోతుంది. 

ఆలస్యంగా గర్భధారణ
గర్భధారణ ఆలస్యం కాకుండా చూసుకోవాలి. అంటే 30 ఏళ్లు దాటే వరకు ఆగకూడదు. దీనివల్ల బ్రెస్ట్ కేన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటున్నట్టు కొన్ని అధ్యయనాల్లో గుర్తించారు. 

బ్రెస్ట్ ఫీడ్
అన్నింటికంటే కీలకమైనది పిల్లలకు పాలు ఇవ్వడం. 30 ఏళ్లలోపే పిల్లలను కనడం, వారికి తల్లిపాలు పట్టడం వల్ల మహిళలకు బ్రెస్ట్ కేన్సర్ రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. పైగా తల్లిపాలతో పిల్లల ఆరోగ్యానికి బలమైన రక్షణ ఏర్పడుతుంది.

హార్మోన్లలో మార్పులు
స్త్రీల హార్మోన్లలో అసమానతలు కూడా బ్రెస్ట్ కేన్సర్ రిస్క్ ను పెంచుతాయి. సంతానోత్పత్తికి చికిత్సలు, ఒవేరియన్ స్టిమ్యులేషన్, మెనోపాజ్ తర్వాత హార్మోన్ల చికిత్స తీసుకోవడం ఇవన్నీ బ్రెస్ట్ కేన్సర్ రిస్క్ ను పెంచేవి.

  • Loading...

More Telugu News