- దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి ఉద్వాసన
- సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి విషయం
- సంస్థ ప్రాధాన్యతలకు అనుగుణంగానే మార్పులు
- స్పష్టం చేసిన మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి
ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో తొలగింపులు కొనసాగుతున్నాయి. టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ తాజాగా వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది. పలు డివిజన్ల నుంచి ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. దీంతో పలువురు ఉద్యోగులు ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో తాము తొలగింపునకు గురైనట్టు పోస్ట్ లు పెడుతున్నారు.
మైక్రోసాఫ్ట్ తనను తొలగించినట్టు మైక్రోసాఫ్ట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వద్ద పనిచేసే వర్క్ సూపర్ వైజర్ కేసీలెమ్సన్ ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ లో ఆమె చాలా సీనియర్. అంతేకాదు, తాజాగా ఉద్వాసనకు గురైన వారిలో ఎక్కువ మంది దీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న వారే ఉన్నారు. దీనిపై మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ‘‘అన్ని సంస్థల మాదిరే మేము సైతం మా ప్రాధాన్యతలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటాం. దానికి తగినట్టు మార్పులు చేస్తుంటాం’’ అని తెలిపారు.
మైక్రోసాఫ్ట్ కు ప్రపంచవ్యాప్తంగా 1.8 లక్షల మంది ఉద్యోగులు ఉంటే, అందులో ఒక శాతాన్ని తగ్గించుకోవాలన్నది సంస్థ లక్ష్యంగా ఉంది. మార్క్ జుకెర్ బర్గ్ కు చెందిన మెటా (గతంలో ఫేస్ బుక్) సైతం సుమారు 15 శాతం మంది (12,000)ని తొలగించే ప్రతిపాదనతో ఉన్నట్టు తెలుస్తోంది. అమెజాన్, గూగుల్ సైతం కొంత మందిని సాగనంపడం తెలిసిందే.