Apple: యాపిల్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలా.. ఇలా చేస్తే బెటర్ అంటున్న నిపుణులు
- తడి తగలకుండా ఫ్రిడ్జ్ లో పెట్టాలని సూచిస్తున్న నిపుణులు
- ఇతర పండ్లతో కలప కూడదని సూచన
- ఏమాత్రం పాడైనా వాటిని తీసి విడిగా పెట్టాలని సలహా
- ఈ జాగ్రత్తలతో యాపిల్స్ తాజాగా ఉండటంతోపాటు పోషకాలూ నష్టపోకుండా ఉంటాయని వెల్లడి
రోజుకో యాపిల్ తింటే డాక్టర్ కు దూరంగా వుండచ్చని ఓ పాత సామెత. అలాగని రోజుకు ఒక యాపిల్ కొనుక్కుని తెచ్చుకుని తినలేం. కొన్ని తెచ్చుకుని ఇంట్లో నిల్వ చేసుకుంటాం. అయితే యాపిల్స్ అయినా, మరే పండ్లు అయినా కొన్ని రోజుల్లోనే పాడైపోతాయి. కొన్నిసార్లు ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా త్వరగానే దెబ్బతింటుంటాయి. ఈ క్రమంలోనే యాపిల్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలనే దానిపై పోషకాహార నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల యాపిల్స్ తాజాగా ఉండటమే కాకుండా.. వాటిలోని పోషకాలు కూడా నష్టపోకుండా ఉంటాయని వివరిస్తున్నారు.
యాపిల్స్ ఎక్కువ రోజులు తాజాగా ఉండేందుకు ఇలా చేయాలి
- యాపిల్స్ ను సరిగా నిల్వ చేసుకోగలిగితే.. కనీసం మూడు, నాలుగు వారాలు తాజాగా ఉంటాయని, అవసరమైతే మరో రెండు వారాలు కూడా నిల్వ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
- యాపిల్స్ కొనేటప్పుడు వాటి కాడలు పోకుండా చూసుకోవాలని.. కాడలు ఉన్న యాపిల్స్ కొంత ఎక్కువ కాలం నిల్వ ఉంటాయని సూచిస్తున్నారు.
- అన్నింటికన్నా ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే.. యాపిల్స్ లో ఏదైనా దెబ్బతిన్నదా, చెడిపోయిందా అన్నది చూడాలి. ఒక్క పాడైపోయిన యాపిల్ ఉన్నా.. మిగతా యాపిల్స్ కూడా వేగంగా పాడైపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- మిగతా పండ్లు, కూరగాయలతో యాపిల్స్ ను కలిపి ఉంచకూడదు. విడిగా పెట్టాలి. ఎందుకంటే యాపిల్స్ నుంచి వెలువడే ఇథైలిన్ గ్యాస్ తో ఇతర పండ్లు, కూరగాయలు త్వరగా పక్వానికి వస్తాయి. అవి పాడైపోయి.. తద్వారా యాపిల్స్ కూడా పాడైపోతాయని నిపుణులు చెబుతున్నారు.
- వీలైతే చిన్న చిన్న రంధ్రాలు ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్ లో యాపిల్స్ ను ఉంచి ఫ్రిడ్జ్ లో పెట్టాలని సూచిస్తున్నారు.
- ఇక ఫ్రిడ్జ్ లలో ప్రత్యేకంగా పండ్ల కోసం కేటాయించిన డ్రాలలో పండ్లను ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిడ్జ్ టెంపరేచర్ ను మైనస్ ఒకటి నుంచి జీరో డిగ్రీల వద్ద ఉండేలా చూసుకోవాలని.. అంతకన్నా తక్కువైతే ఎక్కువైనా యాపిల్స్ ఫ్రీజ్ అయి దెబ్బతింటాయని చెబుతున్నారు.