Telangana: జీనోమ్ వ్యాలీలో ఒకే రోజు 5 కంపెనీలను ప్రారంభించిన కేటీఆర్
- లైఫ్ సైన్సెస్ హబ్ గా జీనోమ్ వ్యాలీ
- 5 కొత్త కంపెనీలను ప్రారంభించిన కేటీఆర్
- రూ.11 వేల కోట్ల పెట్టుబడితో యూనిట్ల ఏర్పాటు
- కొత్తగా 3 వేల మందికి ఉపాధి లభించనుందన్న మంత్రి
హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో మంగళవారం ఒక్క రోజే 5 కొత్త కంపెనీలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ కంపెనీలను ప్రారంభించారు. లైఫ్ సైన్సెస్ కు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన జీనోమ్ వ్యాలీలో ఒకే రోజు 5 కంపెనీలను ప్రారంభించడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. ఇదే రీతిలో ముందుకు సాగితే... 100 బిలియన్ డాలర్ల లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టమ్ త్వరలోనే హైదరాబాద్ లో సాక్షాత్కారం కానుందని ఆయన వెల్లడించారు.
జీనోమ్ వ్యాలీలో మంగళవారం పిరమల్ ఫార్మా, ప్రొపెల్లాంట్, బ్రిటన్ కు చెందిన ఆక్టిస్ ఎల్ఎల్ పీ, జీవీ రీసెర్చీ ప్లాట్ ఫామ్, అమెరికాకు చెందిన ఎన్విగో సంస్థలు తమ నూతన యూనిట్లను ప్రారంభించాయి. ఈ కంపెనీలు మొత్తంగా రూ.11 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టాయని కేటీఆర్ తెలిపారు. ఈ కొత్త యూనిట్ల ద్వారా తెలంగాణలో మరో 3 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఆయన తెలిపారు.