Vijayawada: బాలికపై అత్యాచారం కేసులో విజయవాడ కోర్టు కీలక తీర్పు.. నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
- 2019లో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు
- నేరారోపణ రుజువు కావడంతో శిక్ష విధించిన కోర్టు
- బాధిత బాలికకు రూ. 4 లక్షల పరిహారం అందేలా చూడాలని అధికారులకు ఆదేశం
బాలికపై అత్యాచారం కేసులో విజయవాడలోని పోక్సో కోర్టు కీలక తీర్పు చెప్పింది. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ. 5 వేల జరిమానా విధించింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. విజయవాడ రూరల్ మండలం వైఎస్సార్ కాలనీ జక్కంపూడి గ్రామానికి చెందిన సంగెపు నవీన్ (23) 16 సెప్టెంబరు 2019న స్థానికంగా నివసించే బాలికపై తన ఇంట్లో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు.
అయితే, బాలిక నీరసంగా, ముభావంగా ఉండడంతో గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా, ఈ కేసులో నిందితుడిపై నేరారోపణ రుజువు కావడంతో న్యాయమూర్తి డాక్టర్ రజిని తీర్పు వెలువరించారు. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. బాధిత బాలికకు రూ. 4 లక్షల పరిహారం అందేలా చూడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆదేశించారు.