Snake: విమానంలో పాము.. భయంతో వణికిన ప్రయాణికులు
- అమెరికాలోని న్యూజెర్సీలో ఘటన
- ఎయిర్ పోర్టులో దిగాక విమానంలోకి వెళ్లి పామును పట్టుకున్న సిబ్బంది
- విషపూరితం కాదని వెల్లడించిన అధికారులు
- ఆ తర్వాతే కిందికి దిగిన ప్రయాణికులు
ఇంకొద్దిసేపట్లో విమానం ఎయిర్ పోర్టులో దిగబోతోంది.. ప్రయాణికులను త్వరగా సీట్ బెల్ట్ పెట్టుకోమని సిబ్బంది హెచ్చరిస్తున్నారు. ఓవైపు ఈ హడావుడి కొనసాగుతుండగా బిజినెస్ క్లాస్ లో కలకలం రేగింది. అందులో కూర్చున్న ప్రయాణికులు భయంతో కేకలు వేస్తున్నారు. ఏం జరిగిందని సిబ్బంది వెళ్లి చూడగా.. అక్కడ పాము కనిపించిందని చెప్పారు. దీంతో విమానం అంతటా భయాందోళన నెలకొంది. అమెరికాలోని యునైటెడ్ ఎయిర్ లైన్స్ కంపెనీ విమానంలో చోటుచేసుకుందీ ఘటన.
అయితే, విమానం ల్యాండ్ అయ్యాక తమ సిబ్బంది వెళ్లి పామును పట్టుకున్నారని, ఆ తర్వాతే ప్రయాణికులను కిందికి దించామని, అందరూ క్షేమంగా ఉన్నారని ఎయిర్ లైన్స్ ప్రకటించింది. అనంతరం విమానంలో క్షుణ్ణంగా తనిఖీ చేశామని అధికారులు వెల్లడించారు.
సోమవారం యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఫ్లోరిడా రాష్ట్రంలోని తంపా నగరం నుంచి న్యూజెర్సీకి బయలుదేరింది. బిజినెస్ క్లాసులో కూర్చున్న ఓ ప్రయాణికుడికి చిన్న పాము కనిపించడంతో భయంతో కేకలు వేశాడు. దీంతో విమానంలో గందరగోళం నెలకొంది. దీనిపై ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారమిచ్చిన పైలట్.. విమానాన్ని జాగ్రత్తగా ల్యాండ్ చేశారు.
ఇక అప్పటికే ఎయిర్ పోర్టులో సిద్ధంగా ఉన్న జూ సిబ్బంది విమానంలోకి వెళ్లి పామును పట్టుకున్నారు. సుమారు 18 అంగుళాల నుంచి 26 అంగుళాల పొడవుండే ఆ పామును గార్టర్ స్నేక్ అంటారని, అది విషపూరితమైనది కాదని అధికారులు చెప్పారు. ఫ్లోరిడా రాష్ట్రంలో ఈ రకం పాములు కనిపించడం సర్వసాధారణమేనని వివరించారు. అయితే, ఆ పాము విమానంలోకి ఎలా వచ్చిందనేదానిపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.