Team India: ఆసియా కప్ విషయంలో భారత్, పాక్ క్రికెట్ బోర్డుల మధ్య ఉద్రిక్తత!
- వచ్చే ఏడాది ఆసియా కప్ కు ఆతిథ్యమివ్వనున్న పాక్
- భారత్ ఈ టోర్నీని తటస్థ వేదికలోనే ఆడుతుందన్న బీసీసీఐ కార్యదర్శి జై షా
- భారత్ లో జరిగే 2023 వన్డే ప్రపంచ కప్ బహిష్కరించే యోచనలో పాక్
భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి. వచ్చే ఆసియా కప్ కోసం టీమిండియా.. పాకిస్థాన్ వెళ్లదని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేయడమే ఇందుకు కారణం. ఈ టోర్నీని బారత్ తటస్థ వేదికపైనే ఆడుతుందని తేల్చి చెప్పారు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరిగే 2023 ఆసియా కప్ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ కు కేటాయించారు. కానీ, టీమిండియా ఈ టోర్నీని తటస్థ వేదికపైనే ఆడాలని నిర్ణయించినట్టు ఆసియా క్రికెట్ సమాఖ్య (ఏసీసీ) అధ్యక్షుడు కూడా అయిన జై షా చెప్పారు.
భారత్ చివరగా పాకిస్థాన్ లో 2008 ఆసియా కప్ ఆడింది. కానీ, 2009లో ముంబై లో ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి భారత్.. పాక్ వెళ్లడం లేదు. పాక్ ను కూడా భారత్ ఆహ్వానించడం లేదు. ఈ క్రమంలోనే ఆసియా కప్ ను పాకిస్థాన్ లో ఆడేది లేదని షా ప్రకటించారు.
అయితే, ఆయన ప్రకటనపై పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆసియా కప్‌ను తటస్థ వేదికపై నిర్వహిస్తే ప్రతిగా వచ్చే ఏడాది భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్‌ను బహిష్కరించాలని పాక్ భావిస్తోందని సమాచారం. అదే సమయంలో ఆసియా క్రికెట్ సమాఖ్య సభ్యతాన్ని కూడా ఉపసంహరించుకుంటామని పాక్ హెచ్చరిస్తోంది.