Apple TV 4K: కొత్త జనరేషన్ యాపిల్ టీవీ 4కే.. ధర రూ.14,990
- 4కే టీవీలకు సపోర్ట్ చేసే పరికరం
- ముందటి జనరేషన్ కంటే 50 శాతం అధిక వేగం
- యాపిల్ ఆన్ లైన్, ఆఫ్ లైన్ స్టోర్లలో లభ్యం
యాపిల్ ఐప్యాడ్, ఐప్యాడ్ ప్రో ఎం2 సహా పలు నూతన ఉత్పత్తులను విడుదల చేసింది. తదుపరి జనరేషన్ యాపిల్ టీవీ 4కేను (టీవీకి అనుసంధానించుకునే పరికరం) సైతం విడుదల చేసింది. ఇది ఏ15 బయోనిక్ చిప్ సెట్ తో పనిచేస్తుంది. హెచ్ డీఆర్ 10 ప్లస్, డాల్బీ ఆటమ్స్ కు సపోర్ట్ చేస్తుంది.
యాపిల్ టీవీ 4కే (వైఫై) 64 జీబీ స్టోరేజీతో వస్తుంది. యాపిల్ టీవీ 4కే (వైఫై, ఇథర్ నెట్) గిగాబిట్ ఇథర్ నెట్ కు సపోర్ట్ చేస్తుంది. యాపిల్ టీవీ 4కే, సిరి రిమోట్ తో కలిపి ధర రూ.14,990. యాపిల్ అధికారిక పోర్టల్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. యాపిల్ ఆథరైజ్డ్ స్టోర్లలోనూ కొనుగోలు చేసుకోవచ్చు.
ముందటి జనరేషన్ యాపిల్ టీవీ 4కే కంటే తాజా వెర్షన్ 50 శాతం అధిక వేగంతో ఉంటుందని తెలుస్తోంది. ‘‘యాపిల్ యూజర్లు తమకు ఇష్టమైన ఎంటర్ టైన్ మెంట్ ను 4కే టీవీ పరికరం సాయంతో పెద్ద తెరపై వీక్షించొచ్చు. గతం కంటే ఇది మరింత శక్తిమంతమైనది’’ అని యాపిల్ వైస్ ప్రెసిడెంట్ బాబ్ బార్చెర్స్ తెలిపారు.
యాపిల్ టీవీ 4కే అన్నది స్మార్ట్ హోమ్ హబ్ లాంటిది. తాజా సినిమాలు, వెకేషన్ ఫొటోలు, మ్యూజిక్, ఐఫోన్ లోని 4కే హెచ్ డీఆర్ సినిమాలను టీవీలో మరింత నాణ్యమైన రిజల్యూషన్ తో చూసుకోవచ్చు. 4కే టీవీలకు యాపిల్ టీవీ 4కేను కనెక్ట్ చేసుకోవచ్చు. దీని సాయంతో ఇష్టమైన కంటెంట్ ను హై డెఫినిషన్ లో చూసుకోవచ్చు. ఈ పరికరాన్ని కొనుగోలు చేసే ముందు తమ టీవీకి సపోర్ట్ చేస్తుందా? లేదా అన్నది అడిగి తెలుసుకోవాలి.